రెండో విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌

18 Aug, 2018 02:02 IST|Sakshi

నేటి నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు  

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత మెడికల్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో మిగిలిన సీట్లకు, అఖిల భారత కోటాలో మిగిలిన సీట్లకు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్‌ జరగనుంది. అందుకోసం విద్యార్థులు శనివారం ఉదయం 8 నుంచి ఈ నెల 20 మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అన్ని కేటగిరీ సీట్లకూ కౌన్సెలింగ్‌ జరుపుతారు.

ఇక మొదటి విడతలో సీటు పొంది చేరనివారు ఈసారి అదే కోర్సుకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడానికి అనుమతించరు. వాస్తవంగా రెండోవిడత కౌన్సెలింగ్‌ ఈ నెల 12వ తేదీ నాటికే పూర్తికావాలి. జీవో నంబర్‌ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌పై ఇప్పటివరకు అనిశ్చితి నెలకొంది. చివరకు రెండో విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల కావడం గమనార్హం.  

444 ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌ 
అఖిల భారత కోటా సీట్లలో చేరాక తిరిగి రాష్ట్రానికి కేటాయించిన 63 మిగులు సీట్లతో కలుపుకొని మొత్తం 444 ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లున్నాయి. అందులో ఎంబీబీఎస్‌ 194, బీడీఎస్‌ 250 సీట్లున్నాయి. వాటిల్లో చేరేందుకు విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వాటికి రెండోవిడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని ఎన్‌ఆర్‌ఐ సీట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. చాలామంది విద్యార్థులు సమీప రాష్ట్రాల్లోని డీమ్డ్‌ వర్సిటీల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడ ఫీజు తక్కువుండటంతో విద్యార్థులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. పైగా మరో రెండు కౌన్సెలింగ్‌లు డీమ్డ్‌ వర్సిటీల్లో ఉండటంతో అటువైపు వెళ్తున్నట్లు అంచనా.  

మరిన్ని వార్తలు