ఆరోగ్య రంగంలో అగ్రగామిగా భారత్‌

19 Feb, 2020 02:54 IST|Sakshi
పీయూష్‌ గోయల్, కేటీఆర్‌ చేతుల మీదుగా జినోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును అందుకుంటున్న నరసింహన్‌

నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య రంగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే సత్తా భారత్‌కు ఉందని, 50 కోట్ల మంది ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కల్పించేందుకు చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్‌ సీఈవో వాస్‌ (వసంత్‌) నరసింహన్‌ స్పష్టం చేశారు. దేశంలోని మేధో సంపత్తిని దృష్టిలో ఉంచుకున్నా, బయో టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో మన శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకున్నా భారత్‌ ప్రపంచంపై తనదైన ముద్ర వేసేం దుకు ఇది మంచి తరుణమని అభిప్రాయపడ్డారు.

జీవశాస్త్ర పరిశ్రమల రంగంలో విశేష కృషి జరిపేందుకు బయో ఆసియా ఏటా అందించే జినోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును వాస్‌ నరసింహన్‌ మంగళవారం అందుకున్నారు. మంత్రి కె.తారక రామారావు, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం వైద్య రంగంలో వస్తున్న మార్పులపై వాస్‌ ప్రసంగించారు.  మందులనేవి వచ్చి కేవలం రెండు మూడు వందల ఏళ్లు మాత్రమే అయిందని మందులతో చేసే వైద్యం కూడా ఇప్పుడు మారి పోయి.. కణ ఆధారిత, జన్యు ఆధారిత వైద్యంగా పరిణమిస్తోందన్నారు. కేన్సర్‌తోపాటు గుండె జబ్బులకు, మలేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా కణ ఆధారిత చికిత్సలు అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. 

హైదరాబాద్‌ కేంద్రంగా బయోమ్‌..
నోవార్టిస్‌కు ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కేంద్రం ఉందని, దీనికి అదనంగా బయోమ్‌ పేరుతో ఇంకో వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వాస్‌ నరసింహన్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు