సొంత వాహనాలకూ జీపీఎస్‌!

28 Jan, 2019 09:40 IST|Sakshi

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్‌కు తప్పనిసరి  

ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

ఏటా వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాల చోరీలు

కార్ల వంటివి అదే స్థాయిలో దొంగతనం

వీటికీ కచ్చితంగా జీపీఎస్‌ ఉండాలంటున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: సొంత వాహనం కొందరికి కల, ఎందరికో అవసరం. ప్రస్తుత కాలంలో కొన్ని ఉద్యోగాలు సైతం ద్విచక్ర వాహనం ఉన్నవారికే వస్తున్నాయి. అలాంటి వ్యక్తి తన వాహనాన్ని పోగొట్టుకుని, మరోటి కొనే శక్తి లేకుంటే ఆ పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి ఉదంతాలతో పాటు బ్యాంకులకు చెందిన ప్రజాధనం సైతం మోసగాళ్ల పాలు కాకుండా ఉండాలన్నా.. పోలీసులకు కాస్త పనిభారం తగ్గాలన్నా ఇటీవల కేంద్రం తీసుకున్న ‘జీపీఎస్‌ నిర్ణయం’ వ్యక్తిగత వాహనాలకూ వర్తించాలని పోలీసులు చెబుతున్నారు. ఇది ఎంతో అవసరం, ఉపయుక్తమని స్పష్టం చేస్తున్నారు. 

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు తప్పనిసరి...
ప్రజా రవాణా వాహనాలకు గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌) ఏర్పాటు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమలులోకి తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఆటోలు, ఈ–రిక్షాలు మినహా సెంట్రల్‌ మోటారు వెహికిల్స్‌ రూల్స్‌–1989 కిందకు వచ్చే అన్ని బస్సులు, స్కూల్‌ వాహనాలు, ట్యాకీలతో సహా ఇతర పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఈ వ్యవస్థ ఉండాల్సిందే. నేషనల్‌ పర్మిట్‌ ఉన్న కమర్షియల్‌ వాహనాలకు సైతం జీపీఎస్‌ కిందికి వచ్చే వెహికిల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ (వీఎల్‌టీ) తప్పనిసరి. దీంతోపాటు ప్యానిక్‌ బటన్‌ సైతం ఉంటేనే కొత్త వాటి రిజిస్ట్రేషన్, పాత వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణ సాధ్యమవుతుంది. దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి తీసుకువచ్చింది.

ఏటా వేల సంఖ్యలో వాహనాల చోరీ
హైదరాబాద్‌ నగరంలో ఏటా వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి వ్యక్తిగత వాహనాలు చోరీ అవుతున్నాయి. వీటిలో సగానికి ప్రాథమిక సమాచార నివేదికలు (ఎఫ్‌ఐఆర్‌) జారీ అవుతున్నాయి. ఆపై పోలీసులు తీసుకున్న చర్యల తర్వాత దొరుకున్న వాటి సంఖ్య 50 శాతం కూడా ఉండడం లేదు. మిగతా వాహనాల యజమానులు నష్టపోతున్నారు. ఈ వాహనాలకు ఇన్సూరెన్స్‌ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో డబ్బు రావట్లేదు. ఇది అనేక మంది జీవితాలపై ప్రభావం చూపుతోంది. ఈ వాహన చోరీలకు ప్రధాన కారణం పార్కింగ్‌ సమస్య. ద్విచక్ర వాహనం ఆధారంగా ఉద్యోగం చేసే ఫీల్డ్‌ స్టాఫ్, ఉద్యోగాలకు వెళ్లిడానికి వీటిని వినియోగించే వారిలో అత్యధికులు సాధారణ జీవులే. వీరు ఇరుకైన ప్రదేశాల్లోని అద్దె ఇళ్లల్లో నివసిస్తుంటారు. వీటి ఆవరణల్లో పార్కింగ్‌ సదుపాయాలు లేకపోవడంతో రోడ్డు పైన, వీధుల్లోను నిలుపుకోవాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న చోరులు తస్కరిస్తున్నారు.

జీపీఎస్‌ వ్యవస్థతో ఎంతో మేలు
ఈ తరహా కేసుల దర్యాప్తు కోసం పోలీసులు సైతం శ్రమించాల్సి వస్తోంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు ఉండట్లేదు. అయినప్పటికీ వాహనచోదకులు తమ వాహనాలకు వీఎల్‌టీ వంటి పరిజ్ఞానం అమర్చుకోవట్లేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు రావట్లేదు. కమర్షియల్‌ వెహికిల్స్‌ మాదిరిగా వ్యక్తిగత వాహనాలకు జీపీఎస్‌ పరికరాల ఏర్పాటు తప్పనిసరి చేస్తే ఈ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. కేవలం వాహనాలు పోగొట్టుకున్న వారికి వీలైనంత త్వరగా వాటిని గుర్తించి అప్పగించడం పోలీసులకు తేలికవుతుంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాహనాలు ఖరీదు చేయడం, ఆపై నకిలీ పత్రాల ద్వారా వాటిని విక్రయించేసి రుణం ఎగ్గొట్టడం వంటి చేసే వారికీ చెక్‌ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని యాజమాన్యాలు ద్విచక్ర వాహనాలపై విధులు నిర్వర్తించే తమ ఉద్యోగుల కదలికలూ ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. అయితే ఈ వాహనాలకు ఉండే జీపీఎస్‌ లేదా వీఎల్‌టీ పరికరాలు విడిగా ఉండే తీసి పారేసేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఇంజన్‌కు కనెక్ట్‌గా, అంతర్భాగంగా ఏర్పాటు చేయించాలని పోలీసులు చెబుతున్నారు. అలా చేస్తే పరికరాన్ని తీస్తే బండి స్టార్ట్‌ కాకుండా ఉంటుందని, అప్పడే వీటి ఫలితాలు అందుతాయని పేర్కొంటున్నారు. విద్యార్థినులు,మహిళల భద్రత కోణంలోనూ ఆయా వాహనాలకు ట్రాకింగ్‌ సిస్టం ఉపయుక్తమని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు