ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలు

26 Aug, 2018 04:02 IST|Sakshi

‘నిప్పురవ్వలు పడి మీ బట్టలు కాలిపోయాయి.. క్షమించండంటూ ఇస్త్రీ వాలాల వేడుకోలు, కరెంటు లేదు బట్టలు ఇస్త్రీ చేయడం కుదరలేదనే సమాధానాలను దుస్తులను ఇస్త్రీకి ఇచ్చినప్పుడు మనం నిత్యం వింటూ ఉంటాం. అయితే ఈ సమస్యలేమీ లేకుండా ఇస్త్రీ వాలాలకు ఓ కొత్త పరిష్కారం దొరికింది. అంతేకాదు బొగ్గులతో ఇస్త్రీ చేయడం వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధ వ్యాధులూ దూరం కానున్నాయి. కరెంటు, బొగ్గులతో వాడే ఇస్త్రీ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఇస్త్రీ వాలాలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

5 కేజీల సిలిండర్‌ను ఉపయోగించి 1,100 దుస్తులు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల సిలిండర్‌తో 4,500 దుస్తులు ఇస్త్రీ చేయొచ్చు. అయితే ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఇస్త్రీ పెట్టెల కంటే ఇవి కాస్త ఖరీదైనవి. రూ.2,500 నుంచి రూ.7,000 మధ్య వీటి ధర ఉంటుంది. సాధారణ పెట్టెలు ఆరు కేజీల బరువు ఉంటే ఇవి ఆరున్నర కేజీల బరువు ఉంటాయి. పుణే కేంద్రంగా ఉన్న ఓ కంపెనీ వీటిని సరఫరా చేస్తోంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్రలలో వీటిని వినియోగిస్తున్నారు. సిలిండర్‌ నుంచి పైప్‌ను గ్యాస్‌ స్టౌవ్‌కు ఎలా అమరుస్తామో ఇస్త్రీ పెట్టెకు కూడా అలాగే గ్యాస్‌ పైప్‌ను అమరుస్తారు. ఇస్త్రీ పెట్టె వేడిని నియంత్రించేందుకు రెగ్యులేటర్‌ ఉంటుంది. ఇస్త్రీ పెట్టె లోపలి భాగంలో ఇంధనం మండినా ఇస్త్రీ చేసే వ్యక్తికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు తయారీదారులు.

మరిన్ని వార్తలు