ఇక... మన మండలం/జిల్లా

20 Jul, 2014 01:07 IST|Sakshi
ఇక... మన మండలం/జిల్లా

* ప్రణాళికలు రూపొందించాలంటూ ఆదేశాలు జారీ
* మండల స్థాయిలో ఇలా...

మండల స్థాయిలో 16 అంశాలకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి. మండల పరిషత్  పరిధిలోని ప్రజాప్రతినిధుల వివరాలు, సిబ్బంది వివరాలు  (రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్), వివిధ ప్రభుత్వ కార్యాలయాల మౌలిక సదుపాయాల వివరాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులు, నిధులు, వ్యయం,  ఆదాయ వనరులు, స్వయం సహాయక సంఘాల వివరాలు, మండల పరిషత్‌లోని మొదటి పది ప్రాధాన్యత పనులు, మండల స్థాయిలో శాఖల వారీగా 2013-14, 2014-15 సంవత్సరంలో చేపట్టిన పనుల వివరాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలి. మండల స్థాయి సమావేశాలు 21వ తేదీన ప్రారంభించి, 24లోగా పూర్తి చేయాలి. ఇక్కడ రూపొందించిన ప్రణాళికలను మండల సర్వసభ్యసమావేశంలో ఆమోదించాలి.
 
నీలగిరి : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘మనఊరు-మన ప్రణాళిక’’ గ్రామసభలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ‘‘మన మండలం- మన జిల్లా’’ ప్రణాళికలు తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.  మనఊరు-ప్రణాళిక గ్రామసభలు ఈ నెల 13వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఆదివారంతో ముగియనున్నాయి. రెండు, మూడు మండలాలు మినహా దాదాపు అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తిచేశారు. ఈ సభల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున విన్నపాలు వెల్లువెత్తాయి.

వీటిని అధికారులు క్రోడీకరించి అంచనాలు సిద్ధం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రామస్థాయి ప్రణాళికలను రెండు, మూడురోజుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. కాగా గ్రామ ప్రణాళిక ముగింపు దశకు చేరుకోవడంతో ‘మన మండలం-మన జిల్లా ప్రణాళిక’ సిద్ధం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి జిల్లాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓవైపు గ్రామ ప్రణాళికల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూనే...మరోవైపు మండల, జిల్లా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి శనివారం రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో, జిల్లా స్థాయిలో ఏవిధంగా వివరాలు సేకరించాలనే అంశంపై అన్ని మండలాలకు నమూనా (ఫార్మాట్) పత్రాలను పంపారు.  
 
ఇంటెలీజెన్స్ ఆరా...
ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ఇంటెలీజెన్స్ సైతం ఆరా తీస్తోంది. ఇంటెలీజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. నేరుగా గ్రామసభలకు వెళ్లి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రామసభలు ఏ విధంగా జరుతున్నాయి..? అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారా..? ప్రజల స్పందన ఏవిధంగా ఉంది..? ప్రణాళికలు  మొక్కుబడిగా నిర్వహిస్తున్నారా..? అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు