బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు

30 Dec, 2014 03:12 IST|Sakshi
బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు

* 2, 3 ఏళ్లలో పూర్తి   
* బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి జోగు రామన్న  
* విద్యార్థులతో ప్రేమగా వ్యవహరించాలని సూచన
* సీఎం దృష్టికి చివరి ఏడాది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్
* బీసీల్లో బాగా వెనుకబడిన  కులాలకు ‘కళ్యాణలక్ష్మి’ వర్తింపు!

 
 సాక్షి, హైదరాబాద్: రాబోయే 2, 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లన్నింటికీ సొంత భవనాలు నిర్మించనున్నట్లు ఆ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇందు కోసం వచ్చే బడ్జెట్లో రూ.360 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను ఇంటర్ వరకు పెంచడం ద్వారా డ్రాపౌట్లను తగ్గించేలా చూస్తామని తెలిపారు. సోమవారమిక్కడ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ  ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి టి.రాధ, బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ జైస్వాల్, డెరైక్టర్ కె.ఆలోక్‌కుమార్, మల్లయ్యభట్టు, మల్లిఖార్జున్, సీఈ మల్లేశం, జిల్లా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం విషయంలో ఏ స్థాయి అధికారి, ఉద్యోగి అయినా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించినా.. విధి నిర్వహణలో లోపాలున్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. హాస్టళ్లు, పాఠశాలల్లోని విద్యార్థుల పట్ల మానవతా దృక్పథం, ప్రేమ, కరుణతో వ్యవహరించాలని సూచించారు.
 
 ఫీజుల చెల్లింపుపై సానుకూలత..
  వృత్తివిద్యా కోర్సులు, డిగ్రీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు(దాదాపు రూ.250 కోట్లు) చెల్లిస్తే బాగుంటుందని కొందరు అధికారులు చేసిన సూచనపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఫీజులు, ఇతరత్రా అంశాల పరిశీలనకు బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటుచేయాలని అధికారులు కోరగా, వెంటనే దీనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నట్లు సమాచారం. కొన్ని హాస్టళ్లకు పెద్దమొత్తంలో కరెంట్ చార్జీలు వస్తున్నాయని, వాటిని డొమెస్టిక్ కనెక్షన్‌గా కాకుండా కమర్షియల్‌గా చూడడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతోందని కొన్ని జిల్లాల అధికారులు ప్రస్తావించగా.. దీనిపై జీవో ఉన్నందున తదునుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
 
 ఆధార్ కార్డులు లేనందు వల్ల వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఒకరిద్దరు అధికారులు పేర్కొనగా, ఈ పథకానికి ఆధార్‌కార్డుల లింక్ లేకపోవడం అనేది సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. సమీక్ష అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్‌లోని 12 ఫెడరేషన్లకు తగు నిధులు, సదుపాయాలు కల్పించడం ద్వారా వాటిని బలోపేతం చేస్తామన్నారు. ‘వచ్చే బడ్జెట్‌లో వృత్తుల వారీగా ఆయా సమాఖ్యల ద్వారా కేటాయింపులు చేస్తాం. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే బడ్జెట్ సమావేశాలకు ముందే అఖిలపక్ష భేటీని నిర్వహించి రాష్ట్రంలోని 113 వెనుకబడిన కులాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని చేపడతామన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని బీసీల్లో అందరికీ కాకపోయినా బాగా వెనుకబడిన కులాలకు, సంచార జాతుల(ఏ,బీ,సీ,డీ గ్రూపులు) వారిని గుర్తించి ఇస్తామన్నారు. చలికాలంలో బీసీ హాస్టళ్లలోని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున, వచ్చే ఏడాదినుంచి రూ.500 వ్యయంతో ఒక్కొక్కరికి  బ్లాంకెట్లను అందిస్తామని మంత్రి జోగురామన్న వెల్లడించారు.  
 
 అడవిదొంగలకు ఇక కఠిన శిక్షలు
 అటవీ సంపద కొల్లగొడుతున్న స్మగ్లర్లపై కొరడా ఝళిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అడవిదొంగలకు కఠినమైన శిక్షలను విధించేలా అటవీ చట్టంలో మార్పులు తేనున్నారు. సాదాసీదా చట్టాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 1.50 లక్షల హెక్టార్ల అటవీ భూములు అన్యాక్రాంతం అయినట్టు అధికారులు గుర్తించారు. ఇక అక్రమంగా తరలిస్తున్న అటవీ సంపదకు లెక్కలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం అడవుల్లో నిత్యం వేలాది టన్నుల టేకు అడవి దొంగల పాలవుతోంది. ఒకప్పుడు విస్తృతంగా విస్తరించిన రోజ్‌వుడ్ వృక్షాలు వెతికితే తప్ప కనిపించడం లేదు. అడవిదొంగలకు నామ మాత్ర శిక్షలే పడుతున్నాయి. పట్టుబడిన వారికి  రూ. 2 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష మాత్రమే విధిస్తున్నారు. వెంటనే బెయిల్ లభిస్తుండడంతో స్మగ్లర్లు దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారు. దీన్ని అరికట్టేందుకు అటవీ దొంగలపై నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టేలా చట్టంలో మార్పులు చేసే విషయమై మంత్రి జోగు రామన్న సోమవారం ఉన్నతాధికారులతో చర్చించారు.  స్మగ్లర్లకు కనిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా , దొంగతనం తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానాను పెంచేలా విధానాలు రూపొందించనున్నారు.
 
 ఇతరరాష్ట్రాల చట్టాలు అధ్యయనం...
 పొరుగు రాష్ట్రాలైన  మహారాష్ట్ర, తమిళనాడులో మన కంటే కఠిన శిక్షలు అమలవుతున్నాయి. వాటిని అధ్యయనం చేసి చట్టంలో నిబంధనలు పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి, జీపీఎస్, వైర్ లెస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎకో టూరిజం ద్వారా అడవుల సంరక్షణతోపాటు, ఆదాయం కూడా పొందచ్చని, ఆ దిశగా విధానాలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఎస్బీఎల్ మిశ్రా, వైల్డ్‌లైఫ్ సంరక్షణాధికారి పీకే శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు