మారండి.. మంచి పేరు తెండి

23 Apr, 2015 02:21 IST|Sakshi

నిజామాబాద్‌నాగారం : ‘‘ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు పెంచింది. మంచి వేతనాలనే ఇస్తోంది. అత్యాశకు పోయి లంచాలు తీసుకుంటే మీకే నష్టం. పైసలకు కక్కుర్తి పడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది.. ఇకనైనా మారండి. తీసుకుంటున్న జీతానికి తగ్గట్టు పనిచేయండి’’ అని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ప్రభాకర్ సిబ్బందికి హితవు పలికారు. విద్యుత్ శాఖలో ‘లంచావతారులు’ శీర్షికన సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.

బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లా కేంద్రంలోని పవర్‌హౌజ్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవలి కాలంలో విద్యుత్ శాఖ పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయూలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాలోని డీఈఈలు, ఏడీఈలు, ఏఈలతో చర్చించారని సమాచారం. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘‘మన శాఖపై రైతులు, ప్రజల్లో చెడు అభిప్రాయం ఏర్పడింది. విద్యుత్‌శాఖ అధికారులు ప్రతి పనికి కక్కుర్తి పడడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది.

మీరు తీసుకుంటున్న జీతాలతో కుటుంబాలను సంతోషంగా పోషించుకుంటూ పిల్లలకు మంచి విద్యను అందించవచ్చు. అయినా వినియోగదారుడు, రైతు ఏదైనా పనుల నిమిత్తం మన కార్యాలయానికి వస్తే సంబంధిత ఏఈ, ఏడీఈ, డీఈఈలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నారుు. ఆయూ కారణాలతో ఏసీబీ వలకు చిక్కుతున్నారు.

ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి అక్రమంగా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకోవడం సరికాదు. అవినీతి విషయంలో సీఎండీ, డెరైక్టర్లు సీరియస్‌గా ఉన్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకనైనా మారండి. నిజారుుతీగా పనిచేయండి. శాఖకు మంచి పేరు తీసుకురండి’’ అని సిబ్బందికి సూచించారు.
 
బంగారు తెలంగాణ కోసం..
విద్యుత్‌శాఖ ఉద్యోగులు అందరు బంగారు తెలంగాణ కోసం పాటుపడాలని విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. లంచాలు తీసుకోవడం మంచిది కాదన్నారు. మనకు వస్తున్న జీతాలతో హాయిగా బతకవచ్చన్నారు. మంచిగా పనిచేస్తే వినియోగదారులు దేవుడిగా కొలుస్తారన్నారు. అనంతరం అవినీతి, అక్రమాలకు దూరంగా, మంచి మార్పుతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

మరిన్ని వార్తలు