ఆక్సిజన్‌ పెట్టకుండానే బిల్లు!

9 Jul, 2020 01:09 IST|Sakshi

ఇదేమిటని ఎన్నారై డాక్టర్‌ ఆవేదన

కోవిడ్‌ చికిత్సలకు సంబంధం లేని బిల్లులు వేశారంటూ ఆరోపణ

విలపిస్తున్న సెల్ఫీ వీడియో విడుదల

ఆమె ఆరోపణల్లో నిజం లేదన్న ఆస్పత్రి యాజమాన్యం

సాక్షి, సిటీబ్యూరో: చాదర్‌ఘాట్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్వాకం ఇంకా మరిచిపోకముందే... తాజాగా గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యం పేరుతో ఎన్నారై వైద్యురాలికి షాక్‌ ఇచ్చింది. ఆస్పత్రిలో లేని స్పెషాలిటీ వైద్యులు వచ్చి రోగికి చికిత్సలు అందించినట్లు, ఖరీదైన మందులు వాడినట్లు, వెంటిలేటర్‌ అమర్చినట్లు...ఇలా ఇష్టం వచ్చినట్లు బిల్లు వేశారు. చేతికందిన బిల్లు చూసి..సదరు వైద్యురాలు షాక్‌కు గురైంది. ఇదెక్కడి ఘోరం అంటూ సెల్ఫీ వీడియో తీసి బయటికి వదలడంతో అది వైరల్‌ అయింది.

అసలేమైందంటే...
మూత్రనాళ సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న నగరానికి చెందిన యాదగిరిరావు కేసరిని చికిత్స కోసం జూన్‌ 25న గచ్చిబౌలిలోని ఏసియన్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ఆయనతో పాటే ఆయన కుమార్తె , ఎన్నారై డాక్టర్‌ విజయకేసరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు టెస్టులు నిర్వహించగా, కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆయన కుమార్తె డాక్టర్‌ విజయకేసరి కూడా టెస్టు చేయించుకోగా, ఆమెకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

దీంతో ఆమె కూడా ఇదే ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో అడ్మిటయింది. నిజానికి వీరిద్దరికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేవు. కానీ ఆస్పత్రి సిబ్బంది వారికి మెడికేషన్‌ ఇచ్చినట్లు, ఆక్సిజన్‌ పెట్టినట్లు బిల్లు వేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు బదులు ఫల్మొనాలజీ వైద్యుడిగా పేరు మార్చి అదనంగా మళ్లీ బిల్లు వేశారు. అదేమని అడిగితే.. నాలుగు రోజుల నుంచి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. బలవంతంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌గారు దయచేసి కాపాడండి!.. అంటూ సెల్పీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో సదరు వీడియో వైరలైంది.  

ఇది అనైతికంః డాక్టర్‌ విజయకేసరి, బాధితురాలు
మా నాన్నకే కాదు నాక్కూడా ఒక్క సింప్టమ్‌ కూడా లేదు. నాకు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు, ఐవీ ఇచ్చినట్లు, ఆక్సిజన్‌ ఇచ్చినట్లు బిల్లు వేశారు. నిజానికి విటమిన్‌ సి, మల్టీవిటమిన్, యాంటి బయోటిక్‌ టాబ్లెట్స్‌ మినహా మరే ఇతర మందులు కానీ, ఇంజక్షన్లు కానీ ఇవ్వలేదు. రాని డాక్టర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లు వేశారు. అదేమని ప్రశ్నిస్తే...నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు చెల్లించాలో అర్థం కావడం లేదు. ఇండియాలో ఇదెక్కడి ఘోరం? ఇంత దారుణమా? అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ఇద్దరికీ..14 రోజులకు రూ.2.96 లక్షలేః ఏఐజీ ఆస్పత్రి
తండ్రితో పాటు డాక్టర్‌ విజయ కూడా కోవిడ్‌ పాజిటివ్‌తో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ఐసోలేషన్‌లో భాగంగా తండ్రి కుమార్తెలిద్దరూ వేర్వేరు రూమ్‌లను ఎంచుకున్నారు. తాను ఎన్నారై డాక్టర్‌నని, తనకు ప్రత్యేక రూమ్‌ కావాలని చెప్పిరోజుకు రూ.12 వేలు అద్దె ఉన్న గదిని ఎంచుకున్నారు. తండ్రికి రూ.ఆరు వేలు ఉన్న గదిని ఎంచుకున్నారు. వీరిద్దరి రూమ్‌రెంట్, మందులు, వైద్యుల ఛార్జీ ఇలా 14 రోజులకు మొత్తం రూ.2.96 లక్షల బిల్లు మాత్రమే వచ్చింది. ఆ బిల్లు చెల్లించడం ఇష్టం లేకే ఆమె ఆస్పత్రిపై ఆరోపణలు చేస్తోందని ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు