అప్పు తీర్చకుండా.. అమ్మాయిలను ఎరవేస్తాడు!

14 Feb, 2019 18:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో రాకేష్‌ అరెస్టు కావడంతో అతడి బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ఎస్సార్‌ నగర్‌కు చెందిన రాజ్‌కుమార్‌ అనే రియల్టర్‌ దగ్గర రాకేష్‌రెడ్డి కోటీ యాభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అప్పు తిరిగి చెల్లించమని అడిగితే పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడేవాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా అప్పు ఎగ్గొట్టేందుకు రాకేష్‌రెడ్డి అమ్మాయిలను ఎరవేసే ప్రయత్నాలు చేస్తాడని వెల్లడించాడు.

‘శిఖా చౌదరిని పెళ్లి చేసుకుంటున్నా అంటూ చెప్పుకుని తిరిగేవాడు. జయరాంకు అప్పు ఇచ్చే స్థోమత రాకేష్‌కు లేదు. అతడి వద్ద నాలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసేవాడు. నా దగ్గర కోటిన్నర తీసుకున్నాడు ’ అని సాక్షి టీవీతో రాజ్‌కుమార్‌ పేర్కొన్నాడు.

కాగా జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరి ద్వారా అతడికి స్నేహితుడైన రాకేష్‌... జయరామ్‌ ఆస్తిపై కన్నేసి అతడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. రాకేష్‌ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్‌ నగేశ్‌ కూడా జయరాం హత్యలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు