ఎన్‌ఎస్‌జీ రెడీ..

10 Apr, 2018 10:39 IST|Sakshi

200 ఎకరాల్లో అత్యాధునికసౌకర్యాలతో ఏర్పాటు

వినోబానగర్‌లో నేడు ప్రారంభించనున్నహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ఉగ్రవాదులను సమర్థంగా ఎదుర్కొనేలా కమాండోలకు ఇక్కడ శిక్షణ

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉగ్రమూకల పీచమణిచే జాతీయ భద్రతాదళం(ఎన్‌ఎస్‌జీ) ప్రాంతీయ శిక్షణా కేంద్రం మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. 2008 నవంబర్‌లో ముంబై మహానగరంపై ఐఎస్‌ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడిన అనంతరం ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఎన్‌ఎస్‌జీ ప్రాంతీయ శిక్షణా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముష్కరులను హతమార్చిన ఎన్‌ఎస్‌జీ కమాండోల పోరాట పటిమకు అప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలందాయి. ఇదే క్రమంలో ఇలాంటి ఘటనలను దీటుగా ఎదుర్కొనేందుకు నలువైపులా ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు అవసరమని కేంద్ర సర్కారు భావించింది. అందుకనుగుణంగా దక్షిణాదిన చెన్నైతోపాటు మన రాష్ట్రంలో ఎన్‌ఎస్‌జీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

రూ.157.84 కోట్లతో 200 ఎకరాల్లో..
ఇబ్రహీంపట్నం మండలం వినోభానగర్‌లో 200 ఎకరాల విస్తీ ర్ణంలో ప్రతిపాదించిన ఈ కమాండో శిక్షణా కేంద్రం నిర్మాణ పనులకు 2013లో అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే శంకుస్థాపన చేశారు. రూ. 157.84 కోట్లతో కేంద్ర ప్రజా పనుల విభాగం నిర్మించిన ఈ కాంప్లెక్స్‌ను మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించనున్నారు. ఈ ప్రాంగణంలో హెలిపాడ్, ఫైరింగ్‌ రేంజ్, ఇండోర్‌ షూటింగ్‌ రేంజ్, స్విమ్మింగ్‌ ఫూల్, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఉన్నాయి. కాగా, కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఎన్‌ఎస్‌జీ
ప్రాంగణాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు