పల్లెకింకా పాకాలె..

26 Nov, 2019 02:14 IST|Sakshi

పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్‌ పరిజ్ఞానం తక్కువ

4% గ్రామీణ కుటుంబాల్లోనే కంప్యూటర్‌.. అర్బన్‌లో 23 శాతం

ఇంటర్నెట్‌ వాడుతున్న గ్రామీణులు 14.9%.. పట్టణ ప్రాంతాల్లో 42%

నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కంప్యూటర్, ఇంటర్నెట్‌ వినియోగంలో గ్రామీణ, పట్టణ భారతాల మధ్య పెద్ద ఎత్తున అంతరం ఉందని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌వో) అధ్యయనంలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎక్కువగా ఉందని తేలింది. ‘హౌస్‌హోల్డ్‌ సోషల్‌ కన్జంప్షన్‌: ఎడ్యుకేషన్‌’పేరుతో 2017 జూలై నుంచి 2018 జూన్‌ వరకు 4 దశల్లో నిర్వహించిన 75వ రౌండ్‌ సర్వేను ఎన్‌ఎస్‌వో ఇటీవల విడుదల చేసింది.

ఈ సర్వేలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఎన్‌ఎస్‌వో అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 1,13,757 కుటుంబాలను పలకరించి సమాచారం సేకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో 8,097 గ్రామాలతో పాటు 6,188 పట్టణ బ్లాకుల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలోని ప్రతి కుటుంబం వినియోగిస్తున్న కంప్యూటర్‌ లెక్కలతో పాటు విద్యకు సంబంధించిన పలు అంశాలపై ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం దేశంలో ఉన్న ప్రతి 100 గ్రామీణ కుటుంబాల్లో కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే ఇంట్లో కంప్యూటర్‌ను కలిగి ఉన్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అది 23.4 శాతమని తేలింది. ఇక ఇంటర్నెట్‌ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను వినియోగించే వారి శాతం 14.9గా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 42 శాతంగా ఉంది. 

వయసులోనూ ఆంతర్యం..
వయసు రీత్యా పరిశీలిస్తే ఐదేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో కేవలం 9.9 శాతం మంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉన్నారు. అదే సమయంలో 13 శాతం ఇంటర్నెట్‌ సౌకర్యం వినియోగించే వెసులుబాటును కలిగి ఉన్నారు. గత 30 రోజుల్లో ఇంటర్నెట్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించిన వారి శాతం 10.8గా నమోదైంది. అదే పట్టణ ప్రాంతాలను పరిశీలిస్తే 32.4 శాతం మందికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉందని, 37.1 శాతం మంది ఇంటర్నెట్‌ సౌకర్యం కలిగి ఉండగా, అందులో 33.8 శాతం మంది గత 30 రోజుల్లో క్రమం తప్పకుండా ఇంటర్నెట్‌ను వినియోగించారని ఎన్‌ఎస్‌వో సర్వేలో తేలింది. 

ఎన్‌ఎస్‌వో సర్వేలోని అంశాలు..
– ఏడేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో అక్షరాస్యతా శాతం: 77.7
– అక్షరాస్యతా శాతం: గ్రామీణ ప్రాంతాల్లో 73.5, పట్టణ ప్రాంతాల్లో 87.7
– 15 ఏళ్లు నిండిన వారిలో సెకండరీ విద్య పూర్తి చేసిన వారి శాతం: 30.6 (గ్రామీణ), 57.5 (పట్టణ)
– ఇదే వయసు నిండిన వారిలో గ్రాడ్యుయేషన్‌ చదివిన వారి శాతం: 5.7 (గ్రామీణ), 21.7 (పట్టణ)
– పాఠశాలల్లో అసలు పేర్లు నమోదు కాని వారి శాతం: 15.7 (గ్రామీణ), 8.3 (పట్టణ)
– ప్రాథమిక స్థాయిలో పాఠశాలలకు హాజరవుతున్న వారి శాతం: 86.1
– జనరల్‌ కోర్సులు చదువుతున్న వారు: 96.1 శాతం
– టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్న వారు: 3.9 శాతం
– జనరల్‌ కోర్సుల్లో చదువుతున్న వారికి సగటున ఏడాదికి అవుతున్న ఖర్చు: గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5,240, పట్టణ ప్రాంతాల్లో రూ. 16,308.   

మరిన్ని వార్తలు