రామగుండం ఎన్టీపీసీ ‘మెగా’ విస్తరణ

26 May, 2015 03:36 IST|Sakshi
సోమవారం హైదరాబాద్ లో సీఎం కలసిన ఎన్డీపీసీ సీఎండీ అరుప్ రాయ్

4,000 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు లైన్ క్లియర్
దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ కేంద్రంగా అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీపీసీల మధ్య కుదిరిన అవగాహన
సీఎం కేసీఆర్‌తో సంస్థ సీఎండీ భేటీలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం భారీ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలవబోతోంది.

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా రామగుండంలోని ప్రస్తుత ఎన్టీపీసీ కేంద్రం ఆవరణలోనే నిర్మించాలని సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహనకు వచ్చాయి. ఎన్టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అరుప్‌రాయ్ చౌదరి, దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.వెంకటేశ్వరన్ సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ‘రామగుండం ఎన్టీపీసీ’ విస్తరణకు సంబందించిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఆయన ముందుంచారు. సీఎం సైతం సానుకూలంగా స్పందించారు.
 
పంతం నెగ్గించుకున్న ఎన్టీపీసీ
ఎన్టీపీసీకి రామగుండంలో 9,500 ఎకరాల స్థలం ఉంది. ఇప్పటికే అక్కడ 2,600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలను సంస్థ నిర్వహిస్తోంది. విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా 1,600(2ఁ800) మెగావాట్ల అదనపు సామర్థ్యంతో రామగుండం ప్లాంట్ విస్తరణ పనులను ఇప్పటికే ఎన్టీపీసీ చేపట్టింది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లకు స్థల కేటాయింపుల విషయంలో ఎన్టీపీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకురాగా, ఎన్టీపీసీ మాత్రం రామగుండంపైనే పూర్తి ఆసక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది.

మొత్తం 4,000 మెగావాట్ల ప్లాంట్లను రామగుండంలోనే నిర్మించాలనే ప్రతిపాదనను సంస్థ సీఎండీ అరుప్‌రాయ్ తాజాగా సీఎం కేసీఆర్ ముం దుంచారు. నాలుగేళ్లలో ఈ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు నీటితోపాటు కేంద్రం నుంచి బొగ్గు కేటాయింపుల అంశాన్ని స్వయంగా పరిశీలిస్తానని సీఎం కూడా హామీ ఇచ్చారు. దీంతో నాలుగేళ్లలో రామగుండం ఎన్టీపీసీ సామర్థ్యం 6,600 మెగావాట్లకు చేరనుంది.

కాగా, రామగుండం మండల పరిధిలో బీపీఎల్ సంస్థకు గతంలో కేటాయించిన నిరుపయోగ భూములను తమకు కేటాయించాలని కేసీఆర్‌ను ఎన్టీపీసీ సీఎండీ కోరారు. అయితే ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్న ఈ భూములపై ఎలాంటి హామీ ఇవ్వలేమని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా యాష్ పాండ్(బూడిద నిల్వ స్థలం) ఏర్పాటు కోసం 400 ఎకరాలు కావాలని ఎన్టీపీసీ కోరగా, ఇప్పడున్న యాష్ పాండ్‌తోనే ప్రస్తుతానికి పని కానివ్వాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం.
 
దామరచర్లలో సోలార్ ప్లాంట్లు
నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్‌కో, ఎన్టీపీసీల ఆధ్వర్యంలో 6,400 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. జెన్‌కో ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ వైదొలగడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. జెన్‌కో నిర్మించే థర్మల్ కేంద్రాలతోపాటు అక్కడ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు