విధులకు వెళ్తూ అనంతలోకాలకు..

28 Jun, 2019 14:54 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు మృతి

సర్వీసు రోడ్డు లేకపోవడంతోనే మరణించాడని ఆగ్రహం

సాక్షి, జ్యోతినగర్‌(రామగుండం): ‘నాన్నా మాకు దిక్కెవరు.. పనికి వెళ్తున్నానని చెప్పి ఇలా వెళ్లిపోయావా.. రోడ్డు పాడుగాను నిన్ను మాకు దూరం చేసిందా.. ఇక మాకు నాన్నలేడా’.. అని నాగపురి రాజయ్య మృతదేహం వద్ద కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం రామగుండం మండలం మల్యాలపల్లెకు చెందిన నాగపురి రాజయ్య(48) ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు డీఎం ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

గురువారం విధుల కోసమని సైకిల్‌పై మల్యాలపల్లె నుంచి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుకు వస్తున్న క్రమంలో లేబర్‌ గేట్‌ క్రాస్‌ చేసే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతదేహం వద్ద రోదించారు. మృతుడికి భార్య కొమురమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్‌..
రాజీవ్‌ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందడంతో  గోదావరిఖని వైపు వెళ్లే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్, ఎన్టీపీసీ పోలీసులు సంఘటనా స్థలం వద్ద ట్రా ఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణౖ మెన కారును ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లా రు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గోదావరిఖ ని ప్రభుత్వం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

సర్వీసు రోడ్డు లేకనే ప్రమాదం..
రాజీవ్‌ రహదారిపై బీ–పవర్‌ హౌస్‌ నుంచి సర్వీసు రోడ్డు లేకపోవడంతోనే మల్యాలపల్లెకు చెందిన రాజయ్య మృతిచెందాడని కాంట్రాక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసు రోడ్డు ఉంటే మెయిన్‌ రోడ్డుపైకి రాకుండా ఉండేవాడని, పట్టపగలే నిండు ప్రాణం పోవడంపై వారు రోడ్డు నిర్వాహకులు, సంబంధిత ప్రజాప్రతినిధుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18న హైకింగ్‌ రెస్టారెంట్‌  ఎదుట రహదారిపై జరిగిన ప్రమాదంలో గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ నూతి రమేశ్‌ మృతిచెందిన విషాదం నుంచి ప్రజలు కోలుకోకముందే మరో ప్రమాదం జరగడంపై ఆవేదన చెందుతున్నారు.

పట్టింపులేని ప్రజాప్రతినిధులు..
రాజీవ్‌ రహదారిపై సర్వీసు రోడ్డు లేకపోవడంతో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలను కోల్పోవడంతో పాటు చాలామంది అంగవైకల్యానికి గురవుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెయిన్‌ రోడ్డులో ఉన్న సర్వీసు రోడ్డును నిర్మించలేని వారు ఇంకా ఆయా కాలనీలలో ఉన్న సమస్యలు ఏం పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పడు పరామర్శించడం మానుకుని సర్వీసు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు