రవ్వా శ్రీహరికి ఎన్టీఆర్‌ పురస్కారం

17 May, 2018 01:31 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న లక్ష్మీపార్వతి, డాక్టర్‌ కేవీ రమణాచారి

సాక్షి, హైదరాబాద్‌: స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో ఎన్టీఆర్‌ విజ్ఞాన ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఆయన సతీమణి లక్ష్మీపార్వతి సాహితీ యజ్ఞం చేస్తున్నారని ఎన్టీఆర్‌ విజ్ఞాన ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఏటా ఇచ్చే జాతీయ సాహితీ పురస్కారాన్ని 2018 ఏడాదికి సంస్కృతాంధ్ర పండితుడు రవ్వా శ్రీహరికి ఇవ్వనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ విజ్ఞాన ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది.

రమణాచారి మాట్లాడుతూ... జ్యూరీ కమిటీ మెంబర్లు డాక్టర్‌ అనుమాండ్ల భూమయ్య, ప్రొఫెసర్‌ సూర్య ధనంజయ్, డాక్టర్‌ ముక్తేవి భారతి భేటీ అయి ఎన్టీఆర్‌ జాతీయ సాహితీ పురస్కారానికి శ్రీహరిని ఎంపిక చేశామన్నారు. 2007 నుంచి ఏటా ఈ పురస్కారాన్ని ఇస్తున్నామని లక్ష్మీపార్వతి అన్నారు. పురస్కారంతోపాటు లక్ష నగదు, గోల్డ్‌ మెడల్, ఎన్టీఆర్‌ జ్ఞాపికను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య రానున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు