నాట్యామృతం

18 Oct, 2014 23:58 IST|Sakshi
నాట్యామృతం

నాంపల్లి: వినసొంపైన శాస్త్రీయ సంగీతం... చూడ చక్కని హావభావాలు...అభినయం... ప్రేక్షకుల మదిని దోచేశాయి. ఆనందప్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా మందిరంలో గీతా గణేషన్ శిష్య బృందం ‘శ్రీ కృష్ణ లీలామృతం’ రూపకాన్ని ప్రదర్శించింది.

గీతా గణేషన్ శిష్యురాళ్లు వి.కె.రిషిక, అమృత ముంగికర్, డి.ఎస్.అదితి, అమూల్య మంజా, శివాని, భువనేశ్వరి, శ్రీవేణి, శ్రావ్య, శాంభవి, రసజ్ఞ కలిసి ‘శ్రీ కృష్ణ లీలామృతం’ భరతనాట్య ప్రదర్శనను ఆద్యంతం రక్తికట్టించారు. తొలుత అమృత వర్షిణి రాగంలో వినాయక స్తుతి... ‘గజవాదన బిడువెను గౌరీ తనయా’ అనే కీర్తనతో ప్రదర్శన ప్రారంభమైంది. రెండోఅంశంగా రాజీ నారాయణ్ రచించిన ‘వర్ణం’ కల్యాణి రాగంలో సాగింది.  

‘గోకుల బాల... గోపియ లోల..’ అనే కీర్తనలో శ్రీకృష్ణ జననం, పూతన సంహారం, గోవర్ధనగిరి ధారణం, కాళింది మర్దనం, ద్రౌపదీ మాన సంరక్షణ, గీతోపదేశం తదితర అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం సురేష్ భట్ భావగీతాలపనలో భాగంగా ప్రదర్శించిన గోపికా కృష్ణుల క్రీడలు కళాకారుల ప్రతిభకు దర్పణం పట్టాయి. సారంగ రాగంలో మాధురి ఎన్.కృష్ణన్ స్వరపరిచిన గీతాన్ని చివరి అంశంగా ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనకు మృదంగంతో రామకృష్ణ, శ్రీకాంత్(తబలా), కోలంకన్ అనిల్ కుమార్(వయొలిన్) వాద్య సహకారం అందించారు. నాట్య గురువులు యశోద ఠాగూర్, డాక్టర్ హేమమాలిని, ప్రియదర్శిని గోవింద్‌లు కళాకారులను అభినందించారు. అంతకు ముందు జరిగిన సభలో గీతా గణేషన్ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆనందప్రియ ఫౌండేషన్ పని చేస్తున్నట్లు వివరించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి భారతీయ కళల్లో ఎంతో మందికి శిక్షణనిస్తున్నట్టు చెప్పారు.
 

మరిన్ని వార్తలు