-

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు

13 Feb, 2015 02:27 IST|Sakshi

మహ్మదాపురం (తిరుమలాయపాలెం):  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందకుండా సీఎం చంద్రబాబు నాయుడు మోకాలడ్డుతున్నారన్న ఆగ్రహంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు గురువారం ఇక్కడ విధ్వంసానికి దిగారు. వరంగల్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటనను నిరసిస్తూ మాదిరిపురం-సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం...
 
‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్బంగా సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద 100 అడుగుల భారీ పైలాన్‌ను టీడీపీ నాయకులు నిర్మించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. దీనిని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఆనాడు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మాదిగలకు పెద్ద కొడుకుగా ఉండి, ఎస్సీ వర్గీకరణకు న్యాయం చేస్తా’ అని ప్రకటించారు. ఆయన ఆనాడు ఇచ్చిన మాట తప్పారని, ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన (చంద్రబాబు) పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలోనే, పైలాన్ వద్ద చంద్రబాబు ఆవిష్కరించిన ఎన్టీఆర్ విగ్రహంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ జెండా దిమ్మెను కూల్చేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కలవారు వచ్చేసరికి వారు ఆటోలో, మోటార్ సైకిళ్లపై సుబ్లేడు వైపు పరారయ్యూరు. స్థానికులు నీళ్లు తెచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. విగ్రహం వెనుక బాగం పూర్తిగా కాలిపోరుు, ఒకవైపునకు వంగింది. ఘటన స్థలంలో ఎమ్మార్పీఎస్ జెండా ఉంది.

ఈ సమాచారమందుకున్న వెంటనే ఎస్సై ఓంకార్ యాదవ్ అక్కడకు వెళ్లారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిప్పు పెట్టిన విగ్రహాన్ని కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ మండల అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు ముమ్మరం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో ఖండించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఉనికి కోసమే ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు