ముగిసిన ‘నుమాయిష్‌’

19 Feb, 2020 10:56 IST|Sakshi

49 రోజుల్లో 20 లక్షల 20 వేల మంది సందర్శన

చివరిరోజు 60 వేల మంది సందర్శకులు

నగర వాసుల ‘మస్ట్‌ విజిట్‌’ ఎగ్జిబిషన్‌గా పేరొందిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) మంగళవారం ముగిసింది. 49 రోజులపాటు కొనసాగిన ఎగ్జిబిషన్‌ను దాదాపు 20 లక్షల మంది సందర్శించారు. నగరంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు ఇక్కడ విక్రయించారు. చివరి రోజు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కొనుగోళ్లు జరిపారు. జ్యువెలరీ, దుస్తులు, పాదరక్షలు, డ్రైఫ్రూట్స్, గృహోపకరణాలు, ఫుడ్‌ స్టాల్స్‌ వద్ద జనం కిక్కిరిసి కన్పించారు. 

అబిడ్స్‌: నాంపల్లి ఎగ్జిబిష్‌ మైదానంలో 80వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్‌) ముగిసింది.  జనవరి 1వ తేదీన ప్రారంభమై నుమాయిష్‌ మంగళవారం ముగిసింది. 49 రోజులపాటు కొనసాగిన ఎగ్జిబిషన్‌ను 20 లక్షల 20 వేల మంది సందర్శించారని ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్, కోశాధికారి వినయ్‌కుమార్‌ ముదిరాజ్‌లు వెల్లడించారు. చివరిరోజు మంగళవారం  దాదాపు 60 వేల మంది ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారన్నారు. 17వ తేదీ (సోమవారం) వరకు 19 లక్షల 60 వేల మంది సందర్శకులు సందర్శించగా మంగళవారం 60 వేల మంది సందర్శకులతో కలిసి మొత్తం 20 లక్షల 20 వేల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శించడం రికార్డు అని వారన్నారు. ఎగ్జిబిషన్‌ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన పోలీసు, రెవెన్యూ, ఫైర్, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ప్రభాశంకర్, వినయ్‌కుమార్‌ ముదిరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు