నుమాయిష్: వేల కుటుంబాలకు బతుకునిస్తుంది

29 Dec, 2019 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయష్‌)కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నుమాయిష్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు పాల్గొననున్నారు. గతేడాదిలా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. అందులో భాగంగా రూ.3 కోట్లతో ఫైర్‌ ఇంజిన్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పై భాగాన ఉన్న విద్యుత్‌ వైర్లను తొలగించి 2 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్‌లో కేబుల్స్‌ వేస్తున్నామన్నారు.

ఆదివారం మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్‌ కొన్ని వేల కుటుంబాలకు బతుకునిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం నుమాయిష్‌ ఎంతగానో దోహదపడుతుందన్నారు. నుమాయిష్ నుంచి వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని 18 విద్యా సంస్థల్లో 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో కిరోసిన్‌, స్టవ్‌వంటివి బ్యాన్‌ చేశామని, ఫైర్‌ సేఫ్టీ కోసం 40 మంది సిబ్బందిని నియమించామన్నారు. దుకాణాల సంఖ్య తగ్గించి జనాలు తిరిగేందుకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఎక్కువగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల స్టాళ్లు ఉంటాయన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ అన్ని రకాల అనుమతులు తీసుకుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు