25 పోస్టులు.. 36,557 దరఖాస్తులు

24 Nov, 2019 02:54 IST|Sakshi

జేపీవో పోస్టులకు పోటెత్తిన నిరుద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: పోస్టులు ఇరవై ఐదే.. వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రం 36,557. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) చేపట్టిన జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ (జేపీవో) పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన ఇది. 2,500 జూనియర్‌ లైన్మన్   (జేఎల్‌ఎం), 25 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్, 500 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు కలిపి మొత్తం 3,025 పోస్టుల భర్తీకి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ గత నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. జేపీవో, జేఎల్‌ఎం పోస్టులకు దరఖాస్తుల గడువు ఈ నెల 10తో ముగియగా, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగిసింది.

25 జేపీవో పోస్టులకు గాను 36,557 మంది, 2,500 జేఎల్‌ఎం పోస్టులకు గాను 58,531 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 500 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు లక్షా 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారవర్గాలు తెలిపాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగియడంతో ఇంకా వచ్చిన మొత్తం దరఖాస్తుల సంఖ్యను నిర్ధారించలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

మొత్తం 3,025 జేఎల్‌ఎం, జేపీవో, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకుగాను 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ముగిసిన అనంతరం అర్హులైన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఇదిలావుండగా జూనియర్‌ లైన్‌మన్, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు డిసెంబర్‌ 15న, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు డిసెంబర్‌ 22న రాత పరీక్ష నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు