గంజాయి  గుప్పుమంటోంది

1 Feb, 2019 00:32 IST|Sakshi

ఏటా పెరుగుతున్న బాధిత విద్యార్థుల సంఖ్య 

2014 నుంచి ఇప్పటివరకు 50 శాతం పెరిగిన వైనం 

పోలీసులకు పట్టుబడకుండా అరకు, వైజాగ్‌ నుంచి రవాణా 

ఐదారు కాలేజీలు మినహా అన్ని కాలేజీల్లో మత్తులో విద్యార్థులు 

నియంత్రణ, నిఘా వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణం 

సాక్షి, హైదరాబాద్‌  : గంజాయి గాండ్రిస్తోంది. విద్యార్థుల మెదళ్లను చిదిమేస్తోంది. గంజాయి మత్తుతో కంపుకొడుతున్నాయి. శివారు ప్రాంతాలకే పరిమితం అయిందనుకున్న గంజాయి ఘాటు ఇప్పుడు హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ప్రముఖ కాలేజీలనూ నిషాలో పడేస్తున్నాయి. నాలుగైదు కాలేజీలు మినహా ప్రతి కాలేజీలోనూ గంజాయి గుప్పుమంటోంది. ఎక్సైజ్‌ శాఖ వరుసగా ఛేదిస్తున్న కేసుల్లో గంజాయి వ్యవహారం యావత్‌ విద్యార్థి లోకాన్ని ఆందోళనలో పడేసేలా కనిపిస్తోంది. హైదరాబాద్, శివారు, ప్రాంతాల్లోని డిగ్రీ, ఇంజనీరింగ్, బీబీఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్, కాలేజీల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిం దని ఎక్సైజ్‌ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు దింపిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వేట సాగిస్తూ గంజాయి దందా సాగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా అనేక సంచలనాత్మక అంశాలను వెలుగులోకి తెచ్చారు. ప్రతి కాలేజీలోని సెక్షన్లలో 15 నుంచి 18 మంది గంజాయి తాగుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ అధ్యయనంలో బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందటి వరకు సెక్షన్‌కు 7 నుంచి 8 మంది మా త్రమే గంజాయి తాగగా.. ఇప్పుడు 50% మేర పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. 2017లో గం జాయి పట్టుకున్న వ్యవహారంలో 17 కేసులు నమో దు చేస్తే, 2018లో ఆ çసంఖ్య 90కి చేరింది. ఈ నెల రోజుల్లో 7 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

‘స్కోరింగ్‌’లో  విద్యార్థులే.. 
ఎక్సైజ్, పోలీసులు ఎప్పటికప్పుడు గంజాయి పట్టుకుని కేసులు నమోదు చేస్తుండటంతో  విద్యార్థులే గంజాయిని వైజాగ్, అరకులో కొనుగోలు చేసి తమ స్నేహితులకు విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించడాన్ని ‘స్కోరింగ్‌’అనే కోడ్‌ పేరుతో పిలుచుకుంటున్నారు.  గతంలో దీన్ని కొంత మంది బ్రోకర్లు, ఏజెంట్లు విద్యార్థులకు అమ్మేవారు. తీరా ఇప్పుడు విద్యార్థులే స్కోరింగ్‌ దందాలోకి దిగడం గుబులు రేపుతోందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గడిచిన 2 నెలల్లో 8 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులపై ఎక్సైజ్‌ శాఖ కేసులు పెట్టింది. వీరి విచారణలో అంబర్‌పేట్, చిక్కడపల్లి, మెహిదీపట్నం, నాంపల్లి, సీతాఫల్‌మండి, ఫలక్‌నుమా, చైతన్యపురి ప్రాంతాల్లోని విద్యార్థులకు అమ్మకం సాగిస్తున్నట్లు తేలింది. అరకు వెళ్లి 2 కేజీల చొప్పున కొనుగోలు చేయడం, దాన్ని ఎక్సైజ్‌ పోలీసుల కంటపడకుండా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో తరలించి స్నేహితులకు అందజేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని అన్ని కాలేజీలు 600 వరకు ఉన్నాయి. ఇందులోని 5 వేల మందికి పైగా విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతున్నట్లు ఎౖజ్‌ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 

నిర్బంధం నుంచి..
ఇంటర్‌ వరకు నిర్బంధంలాగా ఉండి ఇంజనీరింగ్‌కు వచ్చే సరికి ఒక్కసారిగా స్వేచ్ఛా జీవులుగా మారినట్లు విద్యార్థులు ప్రవర్తిస్తున్నారని, దీంతో ఎంజాయ్‌ పేరుతో గంజాయికి అలవాటు పడి మత్తులో జోగుతున్నారని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఇస్తున్న విచ్చలవిడి స్వేచ్ఛ, డబ్బు విద్యార్థులు గంజాయి వైపు మళ్లేలా చేస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్‌ తాగితే వాసన ద్వారా ఇంట్లో తెలుస్తుందని, గంజాయి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదని స్నేహితులు అలవాటు చేస్తుండటంతో ఏటా దీనికి బానిసలవుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోందని అధికారులు
చెబుతున్నారు. 

కాలేజీల  వద్ద నిఘా ఏదీ? 
విద్యాసంస్థలు ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కావడంతో విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు దగ్గరవుతున్నారన్న ఆరోపణలున్నాయి. కాలేజీకి విద్యార్థులు వస్తున్నారా.. ఎందుకు గైర్హాజరు అవుతున్నారు.. వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేంటి.. వస్తే ఆ మార్పు వెనుక కారణాలేంటన్న అంశాలపై దృష్టి పెట్టట్లేదని ఎక్సైజ్, పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. కాలేజీ గ్రౌండ్స్, కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే గంజాయి ఎక్కువగా తాగుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సైజ్‌ సీనియర్‌ అధికారి వెల్లడించారు. కాలేజీలు విద్యార్థులపై దృష్టి పెట్టి, పరిసరాల్లో నిఘా పెడితే ఈ పరిస్థితిని నియంత్రించవచ్చిని చెబుతున్నారు. 

సమష్టిగానే నియంత్రణ.. 
గంజాయి మత్తులో విద్యార్థులు జోగుతూ పోతే పంజాబ్‌ లాంటి పరిస్థితులు వస్తాయని దర్యాప్తు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని నియంత్రణ పోలీస్, ఎౖMð్సజ్‌తో మాత్రమే కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, ఉన్నత విద్యా శాఖ, రెవెన్యూ విభాగాలు సమష్టిగా చర్యలు తీసుకుంటేనే విద్యార్థుల జీవితాలు బాగుపడుతాయని, లేకుంటే ప్రమాదకర పరిస్థితులుంటాయని హెచ్చరిస్తున్నారు. తమ వంతుగా కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, కానీ వాటిని అమలు చేయడం, విద్యార్థులను కనిపెట్టడం యాజమాన్యాలు, తల్లిదండ్రులపైనే ఉంటుందని చెబుతున్నారు.    

మరిన్ని వార్తలు