జేఈఈలో న్యూమరిక్‌ వ్యాల్యూ ప్రశ్నలు

26 Dec, 2019 03:17 IST|Sakshi

జనవరి 6 నుంచి తొలిదశ మెయిన్స్‌ నుంచే అమలు

అడ్మిట్‌ కార్డులు సిద్ధం

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో కొత్తగా ఐదేసి న్యూమరిక్‌ వ్యాల్యూ ప్రశ్నలు

కొత్త ప్యాట్రన్‌లో ఒక్కో సబ్జెక్టులో 25 ప్రశ్నలే

మొత్తం 75 ప్రశ్నలకు 300 మార్కులు

న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలకు మైనస్‌ మార్కులు వర్తించవు

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌లో కొత్తగా ప్రవేశపెడుతున్న న్యూమరిక్‌ వ్యాల్యూ ప్రశ్నల శాంపిల్‌ జాబితాను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌ విభాగాల్లో ఇచ్చే ప్రశ్నల్లో 5 న్యూమరిక్‌ వ్యాల్యూకు చెందినవి ఉంటాయి. కొత్త విధానాన్ని వచ్చే ఏడాది నిర్వహించే తొలిదశ మెయిన్స్‌ నుంచి అమలు చేయనున్నారు. మూడు విభాగాల శాంపిల్‌ ప్రశ్నలను జేఈఈ–2020 వెబ్‌సైట్లో పొందుపరిచారు.

మెరిట్‌ విద్యార్థులు నష్టపోకుండా..
జేఈఈ మెయిన్స్‌లో మల్టిపుల్‌ ఆన్సర్ల ప్రశ్నలకు సంబంధించి ఏదో ఒక సమాధానానికి గుడ్డిగా టిక్‌ చేస్తుండటంతో సామర్థ్యంలేని కొంతమంది విద్యార్థులకు కూడా ఎక్కువ మార్కులు వస్తున్నాయి. దీనివల్ల మెరిట్‌ విద్యార్థులకు నష్టం జరుగుతోందన్న సూచనలు ఎన్‌టీఏకు అందాయి. దాంతో పాటు జేఈఈలో ప్రశ్నల సంఖ్యను కూడా తగ్గిస్తూ కొత్త ప్యాట్రన్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది.

అడ్మిట్‌ కార్డులు సిద్ధం
జేఈఈ–2020 మెయిన్స్‌ తొలిదశ ఆన్‌లైన్‌ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి.  అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పేర్కొంది. విద్యార్థులు ‘జేఈఈ మెయిన్‌.ఎన్‌టీఏ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించింది. డౌన్‌లోడ్‌ కాని పక్షంలో ‘జేఈఈ మెయిన్‌.ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్‌’ అడ్రస్‌కు అభ్యర్థనను ఈ–మెయిల్‌ చేయాలని సూచించింది.

గతంలో ఎలా..ఇప్పుడెలా...
►గతంలో జేఈఈ మెయిన్స్‌లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌ విభాగాల్లో 30 చొప్పున బహుళ సమాధానాల ప్రశ్నలు ఇచ్చేవారు.
►ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. సమాధానాలు తప్పుగా టిక్‌ పెడితే ఒక మార్కుచొప్పున కోత పడేలా మైనస్‌ మార్కుల విధానం అమలు చేస్తున్నారు.
►కొత్త ప్యాట్రన్‌ ప్రకారం 30 ప్రశ్నల సంఖ్యను 25కు కుదించి విద్యార్థులపై భారాన్ని తగ్గించారు.
►ఈ 25 ప్రశ్నల్లో 20 మల్టిపుల్‌ ఆన్సర్లతో కూడిన ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. మిగతా 5 న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలు ఉంటాయి.

►ఈ విభాగంలో మల్టిపుల్‌ ఆన్సర్స్‌ ఇవ్వకుండా కేవలం ప్రశ్న మాత్రమే అడుగుతారు. ప్రశ్నకు సమాధానంగా కేవలం సంఖ్య మాత్రమే ఉంటుంది. ఆన్సర్‌ స్థానంలో ఖాళీని ఉంచుతారు. సరైన సమాధానం వచ్చే సంఖ్యను మాత్రమే విద్యార్థి రాయాల్సి ఉంటుంది.
►ఇలా మూడు విభాగాల్లోనూ న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలు ఐదేసి ఉంటాయి.
►మల్టిపుల్‌ ఆన్సర్‌ ఆబ్జెక్టివ్‌గా ఇచ్చే 20 ప్రశ్నలకు మాత్రమే మైనస్‌ మార్కులు ఉంటాయి.
►న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలకు ఇది వర్తించదు.
►గతంలో జేఈఈ మెయిన్స్‌లో మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల పేపర్లలో ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలకు 120 మార్కుల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు 360 మార్కులకు ఉండేవి.
►తాజాగా ప్రశ్నల కుదింపుతో ఇప్పుడు మూడు కేటగిరీల్లో 75 ప్రశ్నలతో 300 మార్కులకు ఉంటుంది.

మెరిట్‌ విద్యార్థులకు ఎంతో మేలు
‘కొత్త ప్యాట్రన్‌లో న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల విధానం వల్ల మెరిట్‌ విద్యార్థులకు మేలు జరుగుతుంది. గతంలో సబ్జెక్టుపై పట్టులేకున్నా గుడ్డిగా ఏదో ఒక ఆన్సర్‌కు టిక్‌ చేసే వారు అదృష్టవశాత్తు అది కరెక్టు అయితే మెరిట్‌లోకి చేరేవారు. దీనివల్ల ప్రతిభగల అభ్యర్థులకు నష్టం వాటిల్లేది. ఇప్పుడు న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల వల్ల కేవలం ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసినవారే రాయగలుగుతారు. తద్వారా మెరిట్‌ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది.
– కేతినేని శ్రీనివాసరావు
కెమిస్ట్రీ అధ్యాపకుడు, విజయవాడ

మరిన్ని వార్తలు