మన ‘నైటింగేల్స్‌’కు కష్టాలు

27 Dec, 2019 02:51 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రుల్లో అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న నర్సులు

కనీస వేతనాలు అందని వైనం.. రూ.15 వేలూ దాటని దుస్థితి

వచ్చే ఏడాదిని నర్సుల సంవత్సరంగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ  

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ వైద్యం చేస్తే... నర్సులు సేవలు చేస్తారు. అటువంటి నర్సు లకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు తక్కు వ వేతనం ఇస్తూ వారి జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. నర్సులకు కనీసం రూ.20 వేల వేతనమివ్వాలని 2016లో కేంద్రం మార్గదర్శ కాలు విడుదల చేసింది. అలాగే 200 పడకల ఆసుపత్రుల్లోని నర్సులకు, ప్రభుత్వ ఆసు పత్రుల మాదిరిగానే జీతాలివ్వాలని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. ఆ ప్రకారం కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే కనీస వేతనాలు అమలవుతున్నాయి.

ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభు త్వాలు అమలుకు నోటిఫికే షన్లు ఇచ్చాయి. తమిళనాడులో రూ.17 వేల కనీస వేతనం అమలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకూ అటువంటి ప్రయత్నాలేవీ చేయడం లేదన్న విమర్శలున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 8 గంటలకు బదులు 10–12 గంటలు పనిచేయి స్తున్నారు. వేతనాలు రూ.15 వేలు దాటడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘కాల్‌ ఆన్‌ డ్యూటీ’: కార్పొరేట్‌ ఆస్పత్రులు ‘కాల్‌ ఆన్‌ డ్యూటీ’పేరుతో కొత్త రకపు పద్ధతులను ప్రవేశపెట్టాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, కెనడా తదితర దేశాల్లో ఉన్న కాల్‌ ఆన్‌ డ్యూటీ పద్ధతి ఇటీవల రాష్ట్రంలో విస్తరిస్తోంది. ఆ పద్ధతి ద్వారా రోజువారీ, షిప్టుల వారీగా వేతన చెల్లింపుల ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న సిబ్బంది అభద్రతకు గురవుతున్నారు.

అత్యవసర సేవల విభాగం ఐసీయూలో కాల్‌ ఆన్‌ డ్యూటీలో నర్సులను నియమిస్తున్నారు. ఆయా అత్యవసర విభాగాలకు కేసులు వచ్చిన సమయంలో మాత్రమే షిఫ్టుల వారీగా, రోజు వారీగా చెల్లింపు ప్రాతిపదికన అప్పటికప్పుడు ఫోన్‌ చేసి పిలిపించుకుంటున్నారు. అలాంటి వారికి రోజు కూలి కొంత ఎక్కువగా ఇస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత మాత్రం లేదు. అయితే ఎక్కువ పనిగంటలు చేయాల్సి ఉంటుంది. సరాసరిగా రోజుకు ఐసీయూలో విధులు నిర్వహించేందుకు రూ.1,000, ఇన్‌వార్డులో విధులకు రూ.750, నైట్‌షిప్ట్‌ అయితే రూ 1,200 ఇస్తున్నట్టు సమాచారం.

2020 నర్సుల సంవత్సరం..
వచ్చే ఏడాదిని నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపింది. అందువల్ల నర్సింగ్, మిడ్‌వైఫరీ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మందికి ఒక డాక్టరు, ప్రతీ 400 మందికి ఒక నర్సు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతి 1,200 మందికి ఒక డాక్టరు, ప్రతీ 600 మందికి ఒక నర్సు చొప్పున ఉన్నారు.

ప్రపంచంలో నర్సులను తీర్చిదిద్దుతున్న టాప్‌ ఐదు దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. అయినా ఇక్కడ నర్సులకు తీవ్ర కొరత ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19.80 లక్షల మంది నర్సులుండగా ఇంకా 20 లక్షల మంది నర్సులు అవసరం. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు 88 వేల మంది నర్సులున్నట్లు అంచనా. ఇంకా 30 వేల మంది అవసరముంది. ఇదిలావుండగా రాష్ట్రంలో సర్కారు దవాఖాన్లలో సుమారు 6 వేల నర్సింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 8 వేల పోస్టులు అవసరమవుతాయి. అయినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భర్తీపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి.

కనీస వేతనాలు లేవు..
రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకు దారుణంగా వేతనాలు ఇస్తున్నారు. రూ.15 వేలకు మించడంలేదు. కనీసంగా రూ.20 వేలు వేతనం ఇవ్వాలన్న కేంద్రం సిఫార్సులు అమలు కావడం లేదు. దీనిపై రాష్ట్రంలో వైద్య అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో అనేక మంది నర్సింగ్‌ కోర్సు చదివినవారు నిరుద్యోగులుగా మారుతున్నారు.
– రుడావత్‌ లక్ష్మణ్, జనరల్‌ సెక్రటరీ, నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్, తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భర్తీ లేకపోవడం వల్లే..
చాలామంది నర్సింగ్‌ కోర్సు చదివి బయటకు వస్తుండటం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. జిల్లాల్లో రూ.10 వేలు, నగరాల్లో రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయడంలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో టైమింగ్స్‌ కూడా అదనంగా ఉంటున్నాయి. దీంతో తీవ్రమైన పని భారం పడుతోంది.
– నిర్మలారాణి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్, తెలంగాణ

>
మరిన్ని వార్తలు