ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహారలోపం అధికం

28 Sep, 2017 01:41 IST|Sakshi

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సంస్థ తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహారలోపం అధికంగా ఉందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ‘డైట్‌ అండ్‌ న్యూట్రిషనల్‌ స్టేటస్‌ ఆఫ్‌ అర్బన్‌ పాపులేషన్‌ ఇన్‌ ఇండియా’అనే అంశంపై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) ఇటీవల పరిశోధన జరిపింది. కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం, కొచ్చి, కర్ణాటకలోని మైసూర్, బెంగళూరుతోపాటు తెలంగాణలోని హైదరాబాద్‌ సహా మొత్తం 16 రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో నిర్వహించిన ఈ పరిశోధనలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహార లోపం అధికమని తేలింది. ఆహార వినియోగం, హెచ్చుతగ్గుల వల్ల సంక్రమించే వ్యాధులు, శరీరంలో ఏర్పడే మార్పులను ఈ పరిశోధనలో కనుగొన్నారు.

షెడ్యూల్డ్‌ కులాల బాలురలో 32.4, బాలికలు 25.2 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని స్పష్టమైంది. ఆదివాసీ బాలురలో 32.6 శాతం, బాలికల్లో 31.7 శాతం, వెనుకబడిన కులాల్లోని బాలురలో 25.8 శాతం, బాలికల్లో 25.8 శాతం మంది పౌష్టికాహారలోపంతో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. తండ్రి నిరక్షరాస్యుడై తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్న కుటుంబాల్లో ఈ పరిణామం తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. అయితే, దీనికి పేదరికంతోపాటు, నిరక్షరాస్యత, అవగాహనాలోపం, వివక్షలే కారణమని పౌష్టికాహార నిపుణులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

నిజాయితీగా అమలు చేయాలి 
పేదరికం, ఆకలి, అవమానాలతోపాటు పిల్లల ఆరోగ్యంపై అసమానతలు బలమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. దాని నివారణకు మధ్యాహ్నం భోజనం లాంటి పథకాలను నిజాయితీగా అమలు చేయాలి.    
– డాక్టర్‌ కనకరాజు, వైద్యులు

అసమానతలే కారణం  
దేశంలో నెల కొన్న సామాజిక అసమానతలు ప్రజల జీవితాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక విషయాలతోపాటు ఆహారం, ఆరోగ్యాలపై సామాజిక అసమానతలు, వివక్ష తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకు నిదర్శనమే ఎన్‌ఐఎన్‌ సర్వే నివేదిక.
 – ప్రొఫెసర్‌ రమామేల్కొటే, భారత ఆహార కమిషన్‌ మాజీ సలహాదారు 

ఎదుగుదలపై తీవ్రభావం 
ఆర్థిక అసమానతలైనా, సామాజిక వివక్షలైనా, బాలలు, మహిళల పైనే ఎక్కువ ప్రభాన్ని చూపుతాయి. ఎన్‌ఐఎన్‌ నివేదిక దానికి నిదర్శనం. ఎస్సీ, ఎస్టీల్లో నెలకొని ఉన్న పేదరికం ఆ వర్గాల పిల్లల పెరుగుదలపై, మానసిక వికాసంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తోందనడానికి ఇదొక్క ఉదాహరణ చాలు.         
–లలిత, స్త్రీవాద రచయిత్రి, సామాజిక కార్యకర్త  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు