మెట్రో జర్నీ.. మేడ్‌ ఈజీ!

6 Jul, 2018 10:41 IST|Sakshi
మెట్రోస్టేషన్లలో డ్రైవ్‌జీ యాక్టివా వాహనాలను విడుదల చేసిన మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి...

ప్రయాణికులకు సర్వ సదుపాయాలు కల్పిస్తాం

ఐదు మెట్రో స్టేషన్ల వద్ద 125 డ్రైవ్‌జీ వాహనాలు రెడీ

మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

సనత్‌నగర్‌: అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ రూట్లో ఆగస్టులో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులకు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ వరకు సౌకర్యవంతమైన ప్రయాణం సాకారం చేసేందుకు మెట్రోస్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మెట్రో స్టేషన్ల వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన ‘డ్రైవ్‌ జీ’ యాక్టివా వాహనాలను గురువారం ఆయన బేగంపేట తాజ్‌వివంతా హోటల్‌ వేదికగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ నగరానికైనా ప్రజా రవాణా ముఖ్యమని, నగరాలను కార్ల కోసం అభివృద్ధి చేయడం కాదని, ప్రజల కోసం, వారి అవసరాల కోసమేనని స్పష్టం చేశారు.  గ్రేటర్‌లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తరుఫున అన్ని హంగులతో కూడిన ప్రజారవాణా వ్యవస్థను తీర్చిదిద్దేదిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెడల్, జూమ్‌కార్‌ సంస్థలతో కలిసి మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, బేగంపేట, నాగోలు, పరేడ్‌గ్రౌండ్‌  మెట్రోస్టేషన్లలో ద్విచక్రవాహనాలు, కార్లను అద్దె ప్రాతిపదికన అందజేసే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరో ఐదు స్టేషన్లలో ‘డ్రైవ్‌జీ’ యాక్టివా వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.   ఫస్ట్‌ టు లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ అందించే దిశగా డ్రైవ్‌జీ వాహనాలను ప్రారంభించినట్లు వివరించారు. 

125 డ్రైవ్‌ జీ యాక్టివా వాహనాలు షురూ...
మొదటి విడతగా 125 డ్రైవ్‌జీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వాహనాలను బాలానగర్, కూకట్‌పల్లి, ప్రకాష్‌నగర్, తార్నాక, మెట్టుగూడ మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. డబ్లు్యడబ్లు్యడబ్లు్య.డ్రైవ్‌జీ.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాహనాన్ని బుక్‌ చేసుకుని ఆయా స్టేషన్ల వద్ద వీటిని పికప్‌ చేసుకోవచ్చు. అయితే ముందుగా మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు పాన్‌కార్డును కూడా ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

కిలోమీటర్‌కు రూ.3...
డ్రైవ్‌జీ వాహనాలను అద్దెకు తీసుకునే వారి నుంచి కిలోమీటరుకు రూ.3 ఛార్జీగా వసూలు చేస్తారు. కనీస దూరం ఐదు కిలోమీటర్లుగా పరిగణించి రూ.15 వసూలు చేయాలని నిర్ణయించారు. నెలవారీగా అద్దెకు తీసుకోవాలంటే రూ.2,700 చెల్లించాల్సి ఉంటుంది.  భవిష్యత్తులో వినియోగదారుల సంఖ్యను బట్టి ఈ ధర మారుతుందన్నారు. త్వరలో ఏడు రోజులు, 15 రోజుల చొప్పున పాస్‌లు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

మల్టీలెవల్‌ పార్కింగ్‌కు ప్రతిపాదనలు...
ప్రకాష్‌నగర్‌ స్టేషన్‌ మినహాయించి అన్ని మెట్రోస్టేషన్లలోనూ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లకు సమీపంలో మల్టీలెవల్‌ పార్కింగ్‌ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నాన్నారు. 

ఎంజీబీఎస్‌ వద్ద స్కైవాక్‌లు...
ఎంజీబీఎస్‌కు అనుసంధానం చేసేలా రెండు వైపులా స్కైవాక్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఎంజీబీఎస్‌లోకి వెళ్లేందుకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ పనులను   పూర్తి చేయనున్నట్లు ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు