బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం

10 Jul, 2018 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాతీయ ప్రెసిడెంట్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, టీడీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ బూరనర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. లోక్‌ సభలో బీసీలపై బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.  బీసీల కోసం కేంద్ర మంత్రులకు 2వేల లేఖలు రాశానని పేర్కొన్నారు.  

బీసీ రిజర్వేషన్ల కోసం 11 సంవత్సరాలు పోరాటం చేశానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంత రావు అన్నారు. బీసీల కోసం ప్రత్యేక పార్టీ అవసరం లేదు.. ప్రతి పార్టీలో బీసీ నేతలు ఉన్నారన్నారు. జ్యోతిరావు పూలే బీసీల కోసం గొప్ప పోరాటం చేశారని తెలిపారు. పూలే విగ్రహాలను అన్ని గ్రామాల్లో  ఏర్పాటు చేసి, ఆయన భవనాలు కట్టించాలని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బీసీ భవన్‌ కోసం ఏర్పాటు చేసిని స్థలాలను బీసీ నాయకులే కబ్జా చేశారని పేర్కొన్నారు. కొంతమంది నేతలు రాజ్యాధికారం మా రక్తంలోనే ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మాత్రమే బీసీలవి అధికారం మాత్రం ఎవరిదో అన్నట్లు ఉందన్నారు. కేసీఆర్‌ క్యాబినెట్‌లో ఎంత మంది బీసీలన్నారో చెప్పాలని ప్రశ్నించారు. 

టీటీడీపీ ప్రెసిడెంట్‌ ఎల్‌.రమణ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కోసం పోరాటం చెయ్యాలని  అన్నారు. బీసీల ఓట్లను ఇతర నేతలు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకొని వాటిని మన కోసం మన వైపు మళ్లించుకోవాలని రమణ  పేర్కొన్నారు. బీసీ కులాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చెయ్యాలన్నారు.బీసీలకు అధికారం వచ్చేందుకు నా వంతు కృషిచేస్తానని రమణ అన్నారు.

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఓబీసీల అధికారం కోసం కృషిచేస్తున్న ఈశ్వరయ్యకు అభినందనలు తెలిపారు. బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా.. ఐకమత్యం లేదని, ఓబీసీలను దేశంలో చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఓబీసీ బిల్లు బీజేపీ ఆధ్వర్యంలో లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో మాత్రం పాస్ కాదని తెలిపారు. 

టీటీడీపీ ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి.. కానీ రాను రాను ఒకరిపై ఒకరు అజమాయిషీ చలాయించడం జరుగుతుందని అన్నారు. ఓటు హక్కు అనే విషయంపై సుదీర్ఘమైన చర్చ జరిగిన తరువాతే ఓటు హక్కును కల్పించారని తెలిపారు. ఈ రోజుల్లో కొంత మంది రాజుల తరహాలో ప్రవర్తిస్తున్నారు.. కానీ గతంలో ప్రతి ఒక్కరు అధికారులే, నాయకులేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజ్యాంగానికి లోబడే పని చెయ్యాలి.. కానీ ఎవ్వరూ రాజ్యాంగానికి లోబడి పనిచెయ్యడం లేదన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా