సమైక్య ఉద్యమం 

8 Aug, 2019 01:12 IST|Sakshi
సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన ఓబీసీ మహాసభకు హాజరైన పలు పార్టీలు, బీసీ సంఘాల ప్రతినిధులు

జనాభా ప్రకారమే బీసీలకు కోటా

ఓబీసీ జాతీయ సదస్సు తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌ : జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అదే ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని, నిర్దేశిత 28% రిజర్వేషన్లు తప్పనిసరి చేయాల్సి ఉంటే 6–11% మాత్రమే అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కలి్పంచిన హక్కులను సాధించుకునేందుకు బీసీలు చేపడుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. బుధవారం సరూర్‌నగర్‌ స్టేడియంలో జరి గిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బీసీలంతా కలిసికట్టుగా రిజర్వేషన్‌ ఉద్యమాలు చేపట్టాలన్నారు. జాతీయ బీసీ సదస్సు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

బీసీలకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించిందని, ఖర్చు విషయాన్ని పక్కనపెడితే బీసీల పట్ల కేంద్రం కంటే ఉదారంగా రాష్ట్రం వ్యవహరిస్తుందన్నారు. కేటాయించిన నిధులను తర్వాతైనా ఖర్చు చేయాల్సిందేనన్నారు. రాజ్యాంగం కలి్పంచిన హక్కులన్నీ సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపొద్దని పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అన్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు ఐక్యంగా పోరాడితేనే డిమాండ్లు సాధించుకోవచ్చని అన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు వినతులు ఇచ్చే స్థాయిలో ఉంటే.. అతి తక్కువ జనాభా ఉన్న వర్గాలు మాత్రం పరిపాలించే స్థాయిలో ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి మహదేవ జనార్దన అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ప్రతి బీసీ ఉద్యమకారుడిగా ఎదగడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని అన్నారు. బీసీ జనగణన చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలను బహిర్గతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. 
 
బీసీ డిక్లరేషన్‌ ఏమైంది?: జస్టిస్‌ ఈశ్వరయ్య 
రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్‌ చేపట్టాలని జస్టిస్‌ ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. ‘ఒక్క సంతకంతో ఈ డిమాండ్లన్నీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పినప్పటికీ.. దాని ఊసేలేదు. బీసీ డిక్లరేషన్‌ అమలు కావటం లేదు. దేశవ్యాప్తంగా బీసీల జనాభాను తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమం చేస్తేనే హక్కులు రక్షించబడతాయి. పాఠశాల విద్యను జాతీయం చేయాలి. ప్రాథమిక ఆరోగ్య విధానం మెరుగుపర్చాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కలి్పంచాలి. క్రిమిలేయర్‌ను వెంటనే తొలగించాలి. బీసీల అభ్యున్నతికి పలు కమిషన్లు ఇచ్చిన సూచనలు, రిపోర్టులు తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు.

రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. బడుగు, బలహీనవర్గాల నుంచి చట్టసభలకు ఎన్నికైతేనే వారి డిమాండ్లను ప్రభుత్వానికి చెప్పే అవకాశం వస్తుందన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. బీసీల సంక్షేమానికి కేంద్రం పలు సంక్షేమ పథకాలను తీసుకొచి్చందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు దేవేందర్‌ గౌడ్, బూర నర్సయ్య గౌడ్, సినీనటుడు ఆర్‌.నారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు మహారాష్ట్ర, కేరళ, పాండిచేరీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 18 రాష్ట్రాల ఓబీసీ నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. చదువుతోనే చైతన్యం వస్తుందని, బీసీలంతా తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహించాలని సినీ నటుడు సుమన్‌ తల్వార్‌ అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. 

జాతీయ ఓబీసీ మహాసభ ముఖ్యమైన తీర్మానాలివే! 

  • కులాల వారీగా బీసీ జనాభాను ప్రభుత్వం బహిర్గతం చేయాలి 
  • వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ వర్గాలకు చెందిన వారికే ఈ శాఖ పగ్గాలు. 
  • విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కేటాయించాలి 
  • బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి 
  • బీసీ రిజర్వేషన్లకున్న క్రిమిలేయర్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కలి్పంచాలి 
  • ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 
  • ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత స్థానాల్లోని పోస్టుల్లోనూ బీసీ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలి 
  • బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి 
  • మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇవ్వాలి  
మరిన్ని వార్తలు