గ్రామీణుల్లో పెరుగుతున్న ఊబకాయం

13 May, 2019 06:56 IST|Sakshi

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమస్య

పట్టణ ప్రజల్లో కాస్త నయమే

దేశంలో 12 లక్షల మందిపై అధ్యయనం

గ్రామీణ ప్రాంతాల్లో ఊబకాయం,అధిక బరువు పెరగడానికి 80 శాతం ఆహారపుఅలవాట్లు, సంప్రదాయ ఆహారాన్ని విస్మరించడమేనని ఎన్‌ఐన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌  లక్ష్మయ్య, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్యాపకులు ప్రొఫెసర్‌ మజీద్‌ ఇజ్జతి తమ పరిశోధనల్లో వెల్లడించారు.

తార్నాక: అధిక బరువు.. ఊబకాయం.. స్థూలకాయం.. పేరేదైనా మనిషిని ఇబ్బంది పెట్టే తీవ్రమైన సమస్య. అత్యధిక మంది నగర వాసులను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. సమయానికి నిద్ర లేకపోవడం సరైన తిండి తినకపోవడం.. అధిక పని ఒత్తిడి.. జంక్‌ఫుడ్‌ తదితర సమస్యలతో ఇప్పటి వరకు ఊబకాయం నగర వాసులను పట్టిపీడిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ సమస్య భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర రూపం దాలుస్తున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. ‘ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌’ అభివృద్ధి చెందుతున్న, మధ్య ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లోని గ్రామీణప్రాంత ప్రజల్లో ఊబకాయంపై పరిశోధనలు చేసింది. ఈ మేరకు భారతదేశంలో గ్రామాల్లో సేకరించిన డేటాను తార్నాకలోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌నూట్రీషన్‌(ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు ఇటీవల లండన్‌ కళాశాలకు అందజేశారు.అందులో మన గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కరమైన నిజాలు వెలుగు చూశాయి. 

112 మిలియన్ల మందిపై అధ్యయనం
మనిషి శరీరాన్ని అతడి బరువు, ఎత్తు, ఆకృతి, ఇతర అంశాలను ఆధారంగా కొలుస్తారు. దాన్ని ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బీఎంఐ) అంటారు. ఊబకాయం, అధిక బరువుపై ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో వేయి మంది పరిశోధనా విద్యార్థులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 112 మిలియన్ల యువతపై అధ్యయనం చేశారు. 1985 నుంచి 2017 వరకు దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగిన ఈ అధ్యయనంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లోనే ఊబకాయం, అధిక బరువు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీఎంఐ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల్లో ఉండాల్సి కనీస బరువుకంటే 5 నుంచి 6 కేజీలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో పట్టణ ప్రాంత ప్రజల్లో గ్రామీణుల్లో కంటే ఊబకాయం తక్కువగా ఉన్నట్లు నమోదైంది.  

భారతదేశంలోనూ పరిశోధనలు  
మనదేశంలో ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు పలు రాష్ట్రాల్లో 1.2 లక్షల మందిపై అధ్యయనం చేశారు. భారతదేశంలో 1975–79 మధ్య జరిగిన అధ్యయనంలో 16.5 కేజీల (మీటర్‌ స్వేర్‌–ఎం 2) బరువు నమోదు కాగా, అది 2012 నాటికి 18.5 కేజీ (మీటర్‌ స్వేర్‌–ఎం 2)లకు పెరిగింది. అత్యధికంగా బరువు పెరిగిన రాష్ట్రాల్లో కేరళ (3.8 కేజీ), పశ్చిమ బెంగాల్‌(2.6 కేజీ), ఆంధ్రప్రదేశ్‌ (2.6 కేజీ) ఉంగా, అత్యల్పంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో నమోదైనట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 32 ఏళ్ల అధ్యయనంలో గ్రామీణ ప్రాంతంలోని పురుషుల్లో ఊబకాయం, అధిక బరువు 2 శాతం నుంచి 12 శాతానికి పెరగ్గా, మహిళల్లో 4 నుంచి 16 శాతానికి పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. అంటే పురుషులు కంటే మహిళలు దాదాపు 2 కేజీల బరువు  అధికంగా పెరిగారు.  

పోషకాహారలోపమే కారణం
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం, అధిక బరువు పెరడగానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, పోషకాçహారలోపాలే కారణమని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ఆహారంలో తక్కువ మోతాదులో పోషకాలు ఉండటం, పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్, నట్స్‌ తినకపోవడం, అన్నిరకాల పోషకాలు కలిగిన పాలు, పాల పదార్థాలు తినకపోవడం వల్లనే ఊబకాయం, అధిక బరువు, ఎనీమియా వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత పేర్కొన్నారు. ప్రజలకు పోషకాహారం అవగాహన కల్పించాలని, తద్వారా ఇలాంటి ఆరోగ్య సమస్యలకు కళ్లెం వేయవచ్చన్నారు. 

మరిన్ని వార్తలు