వచ్చే నెల 9వరకూ అభ్యంతరాల స్వీకరణ

13 Oct, 2018 02:07 IST|Sakshi

     ఆ తర్వాత ఓటర్ల తుది జాబితాలో సవరణలు

     హైకోర్టుకు చెప్పిన ఈసీ

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితాపై నవంబర్‌ 9 వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 19 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఆ తేదీకి 10 రోజుల ముందువరకూ అభ్యంతరాలను స్వీకరిస్తా మని హైకోర్టు సీజే జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనానికి ఈసీ విన్నవించింది. బోగస్‌ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌  నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయో  జన వ్యాజ్యం శుక్రవారం మళ్లీ విచారణకు వచ్చింది.

ఓటర్ల తుది జాబితా శుక్రవారం ప్రకటించామని ఈసీ తరఫు న్యాయవాది అవినాష్‌ ధర్మాసనానికి తెలిపారు. ఓటర్ల జాబితాపై నవంబర్‌ 9 వర కూ అభ్యంతరాలను స్వీకరించాక మార్పులు, చేర్పులతో పాటుగా తొలగింపునకు ఒకరోజు ఉంటుం దని వివరించారు. ఈ మేరకు అఫి డవిట్‌ దాఖలు చేశామన్నారు. ప్రచురించిన ఓటర్ల తుది జాబితాను పరిశీలించేందుకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు అధికారి, సహాయ అధికారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. పోలింగ్‌ కేంద్రాలు, బూత్‌ స్థాయి అధికారుల కార్యాలయాల వద్దా జాబితా బహిర్గతం చేస్తామన్నారు. వాదనల అనంతరం కోర్టు కేసు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు