ఓబులేసు అరెస్టు

22 Nov, 2014 00:32 IST|Sakshi
మహేందర్ రెడ్డి
  • జాకెట్‌లో పెట్టుకుని ఏకే-47 చోరీ   
  •  ఓర్వకల్లు గుట్టల్లో ఆయుధం దాచివేత    
  •  మీడియా సమావేశంలో సీపీ మహేందర్ రెడ్డి
  • సాక్షి, హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి  (కేబీ ఆర్) పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు యత్నించి, కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ ఓబులేసు(37)ను పోలీ సులు అరెస్టు చేశారు. ఓబులేసు  నేరాలబాట.. ఏకే-47 చోరీ.. అరెస్టుపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు.
     
    ఏకే 47- దొంగిలించాడిలా...

    ఓబులేసు గ్రేహౌండ్స్‌లో ఉన్నప్పుడు అక్కడి ఏకే-47ను దొంగిలించేందుకు జాకెట్‌ను ఉపయోగించాడు. గత ఏడాది డిసెంబర్‌లో కూంబింగ్‌కు వెళ్లి వచ్చిన సిబ్బంది ఏకే-47 ఆయుధాలను బెల్‌ఫామ్ గదిలో భద్రపర్చారు. ఇలా కూంబిం గ్‌కు వెళ్లివచ్చిన వారికి మూడు రోజులు సెలవు ఇస్తారు. కానీ, సెలవులో ఉన్నా కూడా ఓబులేసు ఈ గదిలోకి వెళ్లి  లోడెడ్ ఏకే-47ను తీసుకొని సంచిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు చేరుకున్నాడు. అక్కడి రాళ్ల గుట్టల్లో సంచితో పాటు ఆయుధాన్ని దాచిపెట్టాడు. తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అయితే తాను పెట్టిన చోట ఆయుధం ఉందా లేదా అని చూసుకునేందుకు ఓబులేసు ప్రతి వారం ఓర్వకల్లుకు వెళ్లి వచ్చేవాడు.
     
    మొదటి కిడ్నాప్ సక్సెస్..

    ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో మొదటిసారిగా కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనవడు కేబీఆర్ పార్కుకు వాకింగ్ వచ్చినప్పుడు ఏకే-47తో బెదిరించి కిడ్నాప్ చేసి కొత్తూరు శివార్లలోకి తీసుకెళ్లాడు. రూ.10 లక్షలు తీసుకుని వదిలిపెట్టాడు. ఇందులోంచి రూ.3 లక్షలను తన బ్యాంకు అకౌంట్‌లో మరుసటి రోజు జమచేశాడు. మిగిలిన ఏడు లక్షలతో వాహనం ఖరీదు చేసి జల్సా చేశాడు.
     
    ముందు రోజు రాత్రి కేబీఆర్ పార్కులోనే...

    కేబీఆర్ పార్కు వద్ద మొదటి కిడ్నాప్ విజయవంతమవడంతో మరోసారి అదేవిధంగా వీఐపీని కిడ్నాప్ చేసేందుకు ఓబులేసు పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఓర్వకల్లుకు వెళ్లి ఏకే-47 తీసుకొచ్చి నార్సింగిలోని తన గదిలో దాచిపెట్టాడు. 18వ తేదీ రాత్రి 10.30 గంటలకు ఆయుధాన్ని దాచిన సంచితో ఆర్టీసీ బస్సులో ఎస్‌ఆర్‌నగర్ వరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆటోలో కృష్ణానగర్‌లో దిగిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ కేబీఆర్ పార్కుకు చేరుకుని అక్కడే ఓ చెట్టు పొదల్లో దాక్కున్నాడు. మరుసటి రోజు ఉదయం అందరిలాగే వాకింగ్ చేస్తున్నట్లు నటించి ఖరీదైన కారు గురించి చూ స్తుండగా అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కారు వచ్చి ఆగింది. అతడిని లక్ష్యంగా చేసుకొన్న ఓబులేసు.. 7.20 గంటలకు నిత్యానందరెడ్డి కారులోకి ఎక్కిన సమయంలో కిడ్నాప్‌కు యత్నించాడు. అయితే ఆయన ధైర్యంగా ప్రతిఘటించడం, అతని సోదరుడు ప్రసాద్‌రెడ్డి కూడా సహకరించడంతో ఓబులేసు వారి చేతు లు కొరికి కేబీఆర్ పార్కు నుంచి పారిపోయాడు.
     
    సీసీ కెమెరాలే పట్టించాయి...

    ఈ ఘటన తర్వాత ఓబులేసు అశోకాబిల్డర్, ఇందిరానగర్ నుంచి కృష్ణానగర్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆటో ఎక్కి అమీర్‌పేటలో దిగి ఆర్టీసీ బస్సు ఎక్కి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో మరో బస్సు ఎక్కి కర్నూలు చేరుకున్నాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఓబులేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే గుర్తించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఎట్టకేలకు ఓబులేసును కర్నూలులో అరెస్టు చేశాయి. ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనబర్చిన వెస్ట్‌జోన్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు. వారికి రివార్డులు ప్రకటించారు.
     
    19 బుల్లెట్లు ఎక్కడ?

    ఓబులేసు గ్రేహౌండ్స్ నుంచి ఏకే-47తో పాటు మ్యాగజైన్‌ను తస్కరించాడు. ఆ సమయంలో మ్యాగజైన్‌లో 36 బుల్లెట్లు ఉన్నాయి. అయితే కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనలో పది రౌండ్లు ఉపయోగించగా, మరో ఏడు పేలని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 బుల్లెట్లు గుర్తించారు. మిగతా 19 బుల్లెట్లు ఎక్కడ అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరేదైనా నేరం చేసిన సమయంలో కాల్పులకు ఉపయోగించాడా లేక ఎక్కడైనా దాచిపెట్టాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఓబులేసును తిరిగి పోలీసు కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అతడి వెనకాల మరెవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.
     

మరిన్ని వార్తలు