ఖాళీ ఉంటే..కబ్జానే..!

20 May, 2016 02:49 IST|Sakshi

పాస్‌బుక్‌లున్నా మారుతున్న పేర్లు
వేములవాడలో ‘రియల్’ కబ్జాలు
అంతా అధికారుల కనుసన్నల్లోనే..!

 
 
 వేములవాడ రూరల్ :  మీ స్థలాలు మీ పేరుమీదనే ఉన్నాయనే నమ్మకంతో ఆ స్థలాలను చూడకుండా కొన్నిరోజులపాటు నిశ్చింతంగా ఉంటే మీకు తెలియకుండానే అవి ఇతరుల పేర్ల మీదకు మారిపోతాయి. మీ కాగితాలు ఇంట్లో ఉన్నా... బ్యాంకుల్లో కుదబెట్టినా.. ఆ స్థలం మాత్రం ఇతరుల పేరుమీదకు మారుతూనే ఉంటా యి. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో వరుసగా జరగడంతో భూయజమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకున్న పాపానలేరు. ఇదీ రాజన్న క్షేత్ర పరిధిలో జరిగే రియల్ కృత్యాలు.


వేములవాడ మండలంలోని పలు గ్రామాల్లో స్థలాలు కొనుగోలు చేసిన భూయజమానులు వారి స్థలాలు ఇతరుల పేరుమీదుగా మారడంతో లబోదిబోమంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో వేములవాడ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఫాజుల్‌నగర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులు తమ స్థలాలు తమ పేరుమీదనే ఉండి ఆ పాస్‌బుక్కులు బ్యాంక్‌లో ఉన్నప్పటికీ తమకు తెలియకుండా ఇతరులు కాజేశారంటూ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

వేములవాడ పట్టణంలోని జగిత్యాలకు వెళ్లే బస్టాప్ వద్ద ఒక ముస్లిం కుటుంబం కొన్ని సంవత్సరాలుగా కబ్జాలో ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆ స్థలాన్ని ఒక రియల్టర్ కొనుగోలు చేసి అందులో పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సదరు బాధితులు వెళ్లి నిలదీయగా తాను కొనుగోలు చేశానని కాగితాలు చూపుతూ బెదిరింపులకు పాల్పడ్డా డు. ఈ విషయంపై బాధితులు రెవెన్యూ అధికారి కార్యాలయూనికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితంలేదు.

మండలంలోని తిప్పాపురం గ్రామంలో ఉన్న ఒక స్థలాన్ని కొందరు నాయకుల అండతో అధికారుల ప్రోద్బలంతో కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించిన సంఘటనలూ ఉన్నాయి. దీంతోపాటు ఒక ఆశ్రమ స్థలాన్ని  ఇటీవల కొందరు నాయకులు కన్నేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాజన్న ఆలయంతోపాటు వేములవాడ మండలం దినదినాభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతంపై కొంతమంది రియల్ కబ్జాదారుల ఆగడాలు పెరిగిపోవడంతో స్థలాలకు రక్షణ లేకుండా పోయింది.

 కబ్జాదారులకు అధికారుల అండ..?
 వేములవాడ మండలంలో భూకబ్జాదారులకు కొంతమంది ప్రభుత్వ అధికారుల అండతోనే వారి ఆగడాలకు అంతులేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న భూముల వివరాలను భూకబ్జాదారులకు సమాచారం అందిస్తున్న కొంతమంది అధికారులు ముందస్తుగానే ముడుపుల వ్యవహారం మాట్లాడుకుని వారికి పూర్తిగా సహకరిస్తున్నార ని తెలిసింది. కొన్నేళ్లుగా ఎలాంటి కబ్జాలు లేని ఈ మం డలంలో ఈ మధ్యకాలంలో నెలకోటి  కబ్జాల పర్వం వెలుగులోకి వస్తోంది. స్థలాలను పోగొట్టుకున్న బాధితులు అధికారుల వద్ద మొరపెట్టుకున్నా వారు స్పం దించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇలాంటి వాటిపై పూర్తిగా విచారణ జరిపి బాధ్యులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు