అక్టోబర్‌ 6 డెడ్‌లైన్‌

25 Sep, 2018 02:55 IST|Sakshi

అనుమతులు, నిధుల మంజూరుకు అదే చివరి రోజు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లకు తగినట్లుగా ఆపద్ధర్మ ప్రభుత్వం పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటోంది. అక్టోబర్‌ 8న ఓటర్ల తుది జాబితాను విడుదల కానుండటంతో ఆ తర్వాత నుంచి ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా అన్ని ప్రతిపాదనలకు అక్టోబర్‌ 6లోగా ఆమోదం తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిధుల విడుదల, విధాన నిర్ణయాలు అవసరమైన అన్ని అంశాలకు సంబంధించిన ఫైళ్లను గడువుకు రెండు నుంచి నాలుగు రోజుల ముందే పంపాలని సీఎంవో పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం సైతం అనధికారికంగా ఇదే రకమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ వస్తే ఆగిపోయే అంశాలకు ఆమోదం పొందేందుకు అన్ని శాఖలు సిద్ధమవుతున్నాయి. 

రైతు బంధు యథాతథం... 
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల కొనసాగింపునకు అవసరమైన నిధుల విడుదల ప్రతిపాదనలకు ఆమోదమే కీలకం కానుంది. దీనికి అనుగుణంగా అన్ని శాఖలు ప్రతిపాదలను సిద్ధం చేస్తున్నాయి. రైతు బంధు పథకానికి రెండో విడత నిధుల పంపిణీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయ్యాక చెక్కుల పంపిణీ ఉంటుందా అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముందుగానే ఏర్పాట్లు చేసింది. రైతు బంధు రెండో విడత చెక్కుల పంపిణీ కోసం రూ. 5,925 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు జూలై 28న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చెక్కుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు అనుగుణంగా రైతుబంధు వంటి కీలక పథకాలు, కార్యక్రమాల కోసం ప్రభుత్వం ముందుగానే నిధులు, అనుమతులను జారీ చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల విడుదలకూ ముందుగానే ఉత్తర్వులు ఇచ్చింది. స్వయం ఉపాధి రుణాలు, సాగునీటిశాఖలోని పలు ప్రాజెక్టులకు నిధుల విడుదల వంటి అంశాలపై ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిసింది.

ఓటర్ల జాబితా షెడ్యూల్‌ 
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల: 2018 సెప్టెంబర్‌ 10 
అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ: సెప్టెంబర్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు 
అభ్యంతరాల పరిష్కరణ గడువు: అక్టోబర్‌ 4
సమాచార క్రోడీకరణ, ముద్రణ: అక్టోబర్‌7లోగా 
తుది ఓటర్ల జాబితా విడుదల: అక్టోబర్‌ 8  

మరిన్ని వార్తలు