ప్రతిష్టాత్మకంగా ప్రజా ఆశీర్వాదం

27 Sep, 2018 09:22 IST|Sakshi
గిరిరాజ్‌ కళాశాల వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీ కవిత, మంత్రి పోచారం మాజీ ఎమ్మెల్యేలు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ప్రజా ఆశీర్వాద సభను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందస్తు ఎన్నికల ప్రచారం లో భాగంగా అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగసభల్లో తొలి సభ కావడంతో జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందరి దృష్టిని ఆకర్శించే ఈ సభ ను విజయవంతం చేసేందుకు జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నాయకత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది.

అక్టోబర్‌ 3న నిజామాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ఈ బహిరంగ సభకు కేవలం వారం రోజులే గడువుండటంతో ఆ పార్టీ నాయకులు ఇప్పటికే రం గంలోకి దిగారు. బహిరంగసభ నిర్వహణకు సమన్వయ బాధ్యతలను సీఎం కేసీఆర్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతరు ముఖ్యనేతలతో కవిత, పోచారం బుధవారం నిజామాబాద్‌లోని ఎంపీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.

గిరిరాజ్‌ కాలేజ్‌.. 
బహిరంగసభ తేదీ ఖరారైనప్పటికీ సభను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. నగరంలోని గిరిరాజ్‌ కాలేజ్‌ సమీపంలో ఉన్న మైదానంలో సభను నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నేతలతో కలిసి ఈ మైదానాన్ని పరిశీలించారు. వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి.. హెలిప్యాడ్, పార్కింగ్‌ స్థలం వంటి వాటి విషయమై మైదానం వద్ద చర్చించారు. సభకు వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా బైపాస్‌ రోడ్డుకు అవతలి వైపు పార్కింగ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు.

జన సమీకరణపై దృష్టి 
జిల్లాల్లో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి సభకు జనాలను తరలించనున్నారు. నిజామాబాద్‌ అర్బన్, రూరల్‌లతోపాటు, సమీపంలో ఉన్న ఆర్మూర్, బోధన్‌ నియోజకవర్గాల నుంచి వీలైనంత ఎక్కువ మందిని ఈ సభకు తరలించే యోచనలో ఉన్నారు. బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల నుంచి కూడా సభకు జనసమీకరణ చేస్తున్నారు.

జిల్లాలోనే ఎంపీ కవిత.. 
బహిరంగసభ నిర్వహణకు సమన్వయ బాధ్యతలపై దృష్టి సారించిన ఎంపీ కవిత మూడు, నాలుగు రోజులు జిల్లాలోనే ఉండనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తిరిగి సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు.

ఐదు వందల బస్సులివ్వండి : ఆర్టీసీకి ఆదేశాలు.. 
సభకు జనాలను తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఈ సభకు సుమారు ఐదు వందల బస్సులు కేటాయించాలని టీఆర్‌ఎస్‌ నాయకులు కోరినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా (రీజియన్‌)లోని ఆరు డిపోల పరిధిలోని మొత్తం 670 బస్సులున్నాయి. ఇందులో 190 అద్దె బస్సులున్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులు, ఐచర్లు, మ్యాక్సీక్యాబ్‌ వాహనాలను సమీకరిస్తున్నారు. ఆర్టీసీ డీవీఎం అనిల్‌ కుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రెడ్డితో వాహనాల విషయమై మంత్రి పోచారం చర్చించారు.
 
విజయవంతం చేయండి : మంత్రి పోచారం 

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఎంపీ కార్యాలయంలో కవితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు నివ్వెరపోయే విధంగా నిజామాబాద్‌ బహిరంగసభను విజయవంతం చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సభకు జనసమీకరణ చేపడతామని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్‌ ప్రభంజనానికి మించి ఇప్పుడు తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.

ఊళ్లకు ఊళ్లు టీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని తీర్మానాలు చేస్తున్నాయని, ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో 30, 40 గ్రామాలు తమ పార్టీకి అనుకూలంగా తీర్మానాలు చేశాయని వివరించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, నగర మేయర్‌ ఆకుల సుజాత, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, రెడ్‌ కో చైర్మన్‌ ఎస్‌ఏ అలీం, తాజా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే, గణేశ్‌ గుప్తా, షకీల్‌ ఆమేర్, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు