తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి!

21 Apr, 2016 02:21 IST|Sakshi

 మఠంపల్లి : మోడల్ స్కూల్‌లో చదువుతున్నారు కాబట్టి.. మీరు బీసీలు, ఎస్టీలు కాబట్టి... మీకు దరఖాస్తు రుసుం కూడా ఉండదన్నారు... విద్యార్థులందరి దగ్గరి నుంచి దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలన్నీ తీసుకున్నారు... మేం దరఖాస్తు చేసేశాం.. మీరు వెళ్లి పరీక్ష రాయొచ్చని చెప్పారు... తీరా చూస్తే ఆ పరీక్ష రేపు అనగా ఇప్పుడు హాల్‌టికెట్లు రాలేదు... మీ ధ్రువపత్రాలు అప్‌లోడ్ కాదని చెప్పి చేతులు దులుపుకోవడంతో జిల్లాలోని మఠంపల్లి మండలానికి చెందిన 15 మంది విద్యార్థులు పాలీసెట్ - 2016 రాసే అర్హత కోల్పోయూరు. విద్యార్థులు చదువుకుంటున్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు, తనకు పరిచయస్తుడైన కోదాడలోని ఓ కళాశాల ప్రతినిధి ఇద్దరూ కలిసి చేసిన నిర్వాకంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనస్తాపానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా మఠంపల్లిలోని మోడల్‌స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో ఈ ఏడాది 69 మంది విద్యార్థులు 10వ తరగతి విద్యనభ్యసించారు.
 
  పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు జాకీర్‌హుస్సేన్ సలహాతో సుమారు 15 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తు చేసుకునే వారు బీసీ, ఎస్టీలు కాబట్టి దరఖాస్తు రుసుం లేకుండానే అప్లయ్ చేస్తామని... సీట్లు వస్తే మా కళాశాలలోనే తక్కువ ఫీజుకు పాలిటెక్నిక్‌లో చేర్చుకుంటామని చెప్పి ఈ దరఖాస్తులను జాకీర్‌హుస్సేన్‌కు పరిచయస్తుడైన  కోదాడలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి కె.శ్రీనివాస్‌కు అందజేశారు.
 
 దీంతో దరఖాస్తులు చేసుకున్నాం కదా... అని రేయింబవళ్లు చదివి విద్యార్థులు పరీక్షకు సంసిద్ధులయ్యారు. ఈలోగా ఈనెల 21న పాలిటెక్నిక్ అర్హత పరీక్ష జరగనుండటంతో హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో ప్రయత్నించారు. అయితే మో డల్ స్కూల్ నుంచి దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క విద్యార్థికి కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంతో ఆందోళన చెంది ఉపాధ్యాయుడిని సంప్రదించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి శ్రీనివాస్‌ను సంప్రదించగా మోడల్ స్కూల్ విద్యార్థుల దరఖాస్తులు అప్‌లోడ్ కాలేదని అందుకే నెట్‌లో హాల్ టికెట్లు లేవని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
 
 పాఠశాల ప్రమేయం లేదు
 ఈ విషయమై మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ బూర సైదయ్యగౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, మోడల్ స్కూల్ నుంచి అధికారికంగా ఎలాంటి దరఖాస్తులు ఇవ్వలేదన్నారు. వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగిందని, ఇందులో తన ప్రమేయం లేదని చెప్పారు.
 
 ఉపాధ్యాయుడు జాకీర్‌హుస్సేన్ వివరణ..
 కోదాడలోని కళాశాల ప్రతినిధి కుర్రె శ్రీనివాస్ ఎలాంటి ఫీజులేకుండా ఆన్‌లైన్‌లో పాలిసెట్‌కు దరఖాస్తు చేస్తానని చెప్పడంతో ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించిన మాట వాస్తవమేనని తెలుగు ఉపాధ్యాయుడు జాకీర్ హుస్సేన్ చెప్పారు. అయితే, విద్యార్థులు నేరుగా కళాశాల ప్రతినిధికే దరఖాస్తులు ఇచ్చారని, వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగా సాంకేతిక కారణాలతో  అప్‌లోడ్ కాలేదని చెపుతున్నారని చెప్పారు.
 
 విద్యార్థులతో చెలగాటం ఆడొద్దు...
 విద్యార్థుల భవిష్యత్‌తోచెలగాటం ఆడొద్దు. టెన్త్ పూర్తయిన నా కుమార్తెను పాలిటెక్నిక్ చేయించాకున్నా. పరీక్ష తేదీ దగ్గర పడినా హాల్‌టికెట్లు రాలేదు. దరఖాస్తులు చేరలేదనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
 - సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, అల్లీపురం
 

మరిన్ని వార్తలు