కాలువ కనుమరుగు!

6 Sep, 2019 11:38 IST|Sakshi

జీడిమెట్ల పరిధిలో కనిపించని కోర్‌ కాలువ  

ఎన్‌సీఎల్‌ నుంచి అంగడిపేట వరకు ఆక్రమణలు  

ఉప్పొంగుతున్న వరద..10 కాలనీల్లో ప్రభావం   

డ్రైనేజీ బ్లాక్‌.. పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు  

కూల్చివేతలను అడ్డుకుంటున్న జీహెచ్‌ఎంసీ ఉద్యోగి  

అతడే కాలువపై నిర్మాణం చేపట్టిన వైనం

కుత్బుల్లాపూర్‌: జీడిమెట్ల పరిధిలోని కోర్‌ కాలువ కనుమరుగైంది. కాలువపై ఆక్రమణలు వెలియడంతో వరద ఉప్పొంగుతోంది. కాలనీలను ముంచెత్తుతోంది. మరోవైపు డ్రైనేజీ బ్లాక్‌ అయి, ఎగువ కాలనీల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోనల్‌ స్థాయిలో అనుమతులు తీసుకొని కాలువను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టడంతో దాదాపు పది కాలనీల్లోని 15వేలకు పైగా జనం ఇబ్బందులు పడుతున్నారు. 9 ఆక్రమణలను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేయడానికి వెళ్లగా... గతంలో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగంలో పని చేసిన ఓ ఉద్యోగి వారిని బెదిరింపులకు గురి చేయడంతో వెనుదిరిగారు. సదరు ఉద్యోగి సైతం కాలువపై ఆక్రమ నిర్మాణం చేపట్టడం గమనార్హం.

ఇళ్లు ఖాళీ...  
ఉడ్స్‌ కాలనీ, యాదిరెడ్డి బండ, పేట్‌బషీరాబాద్, ఎన్‌సీఎల్‌ సౌత్, వైష్ణోవ్‌ ఎన్‌క్లేవ్, సెయింట్‌ ఆన్స్‌ స్కూల్, హర్షా ఆస్పత్రి, దాదాపు వందకు పైగా అపార్ట్‌మెంట్లకు సంబంధించిన డ్రైనేజీ పైపులైన్‌ వ్యవస్థ ఎన్‌సీఎల్‌ కాలనీ మీదుగా శ్రీనిధి ఎన్‌క్లేవ్‌ నుంచి అంగడిపేట, మీనాక్షి, వెన్నెలగడ్డ చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అయితే ఎన్‌సీఎల్‌ నుంచి అంగడిపేట వరకు కాలువపై ఆక్రమణలు వెలిశాయి. దీంతో వర్షం నీరు మొత్తం ఎన్‌సీఎల్‌ సౌత్‌ కాలనీని ముంచెత్తుతోంది. బాలాజీ ఆస్పత్రి నుంచి కిందకు వెళ్లే రెండో రోడ్డు కుడివైపు గల్లీలో సుమారు 16 ఇళ్లు ఉన్నాయి. వర్షం పడిన ప్రతిసారీ వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదకు తోడు డ్రైనేజీ ఇళ్లలోకి చేరుతోంది. దుర్వాసన, దోమలవ్యాప్తితో ప్లాట్‌ నంబర్‌ 64, 65, 66, 67, 68, 69, 52, 53 యజమానులు అన్నపూర్ణ, గాంధీబాబు, శ్రీహరిరాజు, రంజిత్‌సింగ్, అరవింద్‌గౌడ్, విజయవర్మ, లక్ష్మీదేవి, శ్రీనివాసులు ఏకంగా ఇళ్లు ఖాళీ చేసి అద్దె గదుల్లో ఉండడం గమనార్హం. వరదతో డ్రైనేజీ రోడ్లపైకి చేరడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో చాలామంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.  

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో ఆగస్టు 4న అప్పటి గ్రేటర్‌ కమిషనర్‌ దానకిషోర్, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత పర్యటించారు. ఎన్‌సీఎల్‌ సౌత్‌ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. కాలువపై ఆక్రమణలను తొలగించాలని స్థానిక ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ఉపకమిషనర్‌ మంగతాయారు, ఈఈ కృష్ణచైతన్య, టౌన్‌ప్లానింగ్‌ అధికారి రాజ్‌కుమార్‌ ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లగా... ఆక్రమణదారులు వారినే బెదిరించారు. నోటీసులు లేకుండా ఎలా కూల్చివేస్తారని? ప్రశ్నించారు. అధికారులు ఓవైపు జేసీబీతో కాలువ మట్టిని తొలగించగా... మరోవైపు పూడ్చడంతో అప్పట్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని విజిలెన్స్‌ విభాగంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండతో... గతంలో అదే విభాగంలో పనిచేసిన ఓ ఉద్యోగి స్థానిక అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నాడు. మిగతా ఆక్రమణదారులు కూల్చివేతలకు అంగీకరించినా... ఇతడు మాత్రం అడ్డుకుంటున్నాడు. దీంతో దాదాపు 10 కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

నిధులు మంజూరైనా..
వరద ఇబ్బందులపై స్థానికులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్‌ 2016లో కుత్బుల్లాపూర్‌లో పర్యటించారు. వెన్నెలగడ్డ ఎన్నాచెరువు ఎగువ, దిగువ ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా కోర్‌ కాలువను విస్తరించాలని ప్రాజెక్ట్‌ అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు పనులు జరగలేదు సరికదా.. ఆక్రమణలు వెలిశాయి. ఉడ్స్‌ కాలనీ నుంచి యాదిరెడ్డి బండ మీదుగా బొల్లారం ఫారెస్ట్‌ నుంచి వర్షపు నీరు వెన్నెలగడ్డ ఎన్నా చెరువు వరకు చేరుకుంటుంది. అప్పట్లో కోర్‌ కాలువ ఉండడంతో ఈ వరద సాఫీగా వెళ్లేది. ప్రస్తుతం ఆక్రమణలు చోటుచేసుకోవడంతో వాటిని తొలగించి కోర్‌ కాలువను యథావిధిగా పునరుద్ధరించాలని ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. సుమారు 3 కిలోమీటర్ల మేర 3–5 మీటర్ల మేర వెడల్పుతో కోర్‌ కాలువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే నీటి పారుదల ప్రాజెక్ట్‌ అధికారులు నాలా సర్వే చేపట్టి చేతులు దులుపుకోవడంతో ఈ పనులు ముందుకుసాగడం లేదు. దీంతో మంజూరైన నిధులు కాస్త.. వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.  

ఇదీ పరిస్థితి
కోర్‌ కాలువ ఉడ్స్‌ కాలనీ, యాదిరెడ్డి బండ, పేట్‌బషీరాబాద్, ఎన్‌సీఎల్‌ కాలనీ మీదుగా శ్రీనిధి ఎన్‌క్లేవ్‌ నుంచి అంగడిపేట, మీనాక్షి, వెన్నెలగడ్డ ఎన్నా చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉంది.  ఎన్‌సీఎల్‌ నుంచి అంగడిపేట వరకు కాలువపై 9 ఆక్రమ నిర్మాణాలు వెలిశాయి.  
ఫలితంగా ఎన్‌సీఎల్‌ సౌత్‌ కాలనీని వరద ముంచెత్తుతోంది. మరోవైపు డ్రైనేజీ బ్లాక్‌ అవ్వడంతో ఎగువ కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  
తరచూ వరద, డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతుండడంతో ఎన్‌సీఎల్‌ సౌత్‌ కాలనీ ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.  
2016లో మంత్రి కేటీఆర్‌ ఇక్కడ పర్యటించి కోర్‌ కాలువను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టులో అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ పర్యటించి కాలువపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.  
అయితే ఆక్రమణల కూల్చివేతలను ఓ జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అడ్డుకుంటున్నాడు. సదరు ఉద్యోగి సైతం కాలువపై ఓ అక్రమ నిర్మాణం చేపట్టడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు