ఒక్క నిమిషం కష్టాలు

12 May, 2017 11:01 IST|Sakshi

► ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు
► అనుమతించని అధికారులు


హైదరాబాద్‌: తెలంగాణలోని ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత ఎంసెట్‌ పరీక్ష అనుభవాల దృష్ట్యా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. అక్కడక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని మేడ్చల్‌-మియాపూర్‌ రహదారిలోని రైల్వే ట్రాక్‌ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం ఏర్పడటంతో.. పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ జాంలో ఇరుక్కున్న ఓ విద్యార్థిని ఓ నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావడంతో అధికారులు ఆమెను పరీక్షకు హాజరు కానివ్వలేదు.

కస్తూర్బా జూనియర్‌ కళాశాలలో పరీక్ష రాయాల్సిన ఇద్దరు విద్యార్థులు రెండు నిమిషాల ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి హాజరవడంతో అధికారులు వారిని పరీక్షకు అనుమతించలేదు. గాంధీనగర్‌కు చెందిన శేఖర్‌, సందీప్‌ అనే విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్ల పరీక్షకు ఆసల్యంగా వచ్చారు. ట్రాఫిక్‌ జాం వల్లే సమయానికి రాలేకపోయామని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. నిజమాబాద్‌ జిల్లా కేంద్రంలో పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా రావడంతో.. సుష్మ అనే విద్యార్థినిని అనుమతించలేదు. దీంతో విద్యార్థిని కన్నీరుమున్నీరుగా విలపించింది.

అగ్రికల్చర్‌, ఫార్మసీ సెట్‌ కోడ్‌ విడుదల
కాగా ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న ఎంసెట్‌ 2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల పరీక్ష కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ టి. పాపి రెడ్డి సెట్‌ కోడ్‌ ఎస్‌2ను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు