ఎందుకింత నిర్లక్ష్యం? 

11 Apr, 2019 13:13 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయం మార్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలలు గడుస్తున్నా కార్యాలయం తరలింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. జిల్లా కేంద్రంలోని బాలుర ఐటీఐ ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయం ఉండేది. అయితే, సమీపంలోనే నూతనంగా నిర్మించిన భవనంలోకి కార్యాలయాన్ని మార్చడానికి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.  

నిర్లక్ష్యం.. అలసత్వం.. 
ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయానికి కొత్త భవనం అందుబాటులో ఉంది. పాత కార్యాలయంలోంచి, కొత్త కార్యాలయంలోకి సామగ్రి తరలించడానికి నెల రోజులు పట్టింది. తరలింపు పనులు ఇప్పటికీ సాగదీస్తూనే ఉన్నారు. కరెంట్‌ కనెక్షన్‌ ఉన్నా, కంప్యూటర్లు ఉన్నా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. ఇక్కడ సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదు.

నిరుద్యోగులు ఎంప్లాయ్‌మెంట్‌ కార్డు కో సం దరఖాస్తు చేసుకోవడానికి, ఇతర పనుల నిమి త్తం వస్తే సమాధానం చెప్పే వారే ఇక్కడ కరువయ్యారు. నిరుద్యోగులు కార్డుల రెన్యూవల్‌తో పాటు కొత్త కార్డులు తీసుకోవాలంటే మీ సేవకు వెళ్లాల్సిందే. సమస్యలు వస్తే కార్యాలయానికి వస్తే సమాధానాలు చెప్పే వారే ఉండడం లేదు. 

ఎప్పుడు ఖాళీ కుర్చీలే.. 
కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నా కూర్చీలు మాత్రం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అధికారి ఉన్నంత సేపు మాత్రమే ఉద్యోగులు ఉంటున్నారు. అధికారి ఇలా వెళ్లగానే, సిబ్బంది అలా బయటకు వెళ్లిపోతున్నారు.

ఇది రోజు జరుగుతున్న తంతు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడం, ఇన్‌చార్జి అధికారి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సిబ్బంది ఇష్టారాజ్యమై పోయింది. దీంతో రెండు నెలలు గడుస్తున్నా సామగ్రి తరలింపు పూర్తి కాకపోవడం, కార్యాలయం ఇంకా సిద్ధం కాకపోవడం గమనార్హం.  

సిబ్బంది లేక ఆలస్యం 
మా కార్యాలయంలో సరైన సిబ్బంది లేరు. అందుకే ఆలస్యం అవుతోంది. కంప్యూటర్‌ ఏర్పాటు చేశాం. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోసం యత్నిస్తున్నాం. పనులన్నీ ఒక్కడినే చేయాల్సి వస్తోంది. అందువల్ల కొంత ఆలస్యం జరుగుతోంది. 
– మోహన్‌లాల్, ఇన్‌చార్జి అధికారి 

మరిన్ని వార్తలు