ఆర్టీసీ సమ్మె.. ప్రభావం తక్కువే..

6 Oct, 2019 06:18 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌లో ప్రయాణీకులు

డిపోల నుంచి సగం కదిలిన ప్రగతి రథం

ప్రధాన రూట్లలోనే నడిచిన బస్సులు 

ఇబ్బందులు పడిన పల్లె జనం

బస్టాండ్లు, డిపోల్లో భారీ పోలీసు బందోబస్తు  

అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మికులు 

పలువురి నాయకుల అరెస్ట్, పీఎస్‌కు తరలింపు 

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తొలిరోజు పాక్షికంగా సాగింది. సమ్మెలో మహబూబ్‌నగర్‌ రీజియన్‌లోని తొమ్మిది డిపోలకు చెందిన 3,568 మంది కార్మికులు పాల్గొనడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పోలీస్‌శాఖ సహకారంతో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులు శుక్రవారం 5 గంటల నుంచి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నారు. సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇటు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు రోడ్డెక్కాయి.  

డిపోల్లో పోలీసు బందోబస్తు.. 
కార్మికులు సమ్మెలో దిగడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డిపోలు, బస్టాండ్‌లలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తెల్లవారు జామున నుంచి మహబూబ్‌నగర్‌ డిపోలో ఏఎస్‌పీ వెంకటేశ్వర్లు, డీఎస్‌పీ శ్రీనివాస్‌ బందోబస్తును పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు నడిచేలా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను వి«ధుల్లోకి తీసుకున్నారు. దీంతో ఉదయం నుంచే డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్ల సందడి నెలకొంది. ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి, డిపో మేనేజర్‌ అశోక్‌రాజు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం 6 గంటలకు మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి బస్సులు తరలివెళ్లాయి. బస్టాండ్‌లలో బస్సులు ఉన్నా ప్రయాణికులు అంతంత మాత్రమే కనిపించారు. దీంతో చాలా బస్సులు అరకొర ప్రయాణికులతో తరలివెళ్లాయి.
 
అధిక చార్జీల బాదుడు  
బస్సులకు సంబంధించి ఆయా రూట్లలో ఎలాంటి అదనపు చార్జీలు తీసుకోవద్దని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు ఇచ్చినా తాత్కాలిక కండక్టర్లు మాత్రం టికెట్‌ రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తుండడం విశేషం. కొంతమంది ప్రయాణికులు వారితో వాగ్వివాదం చేసినా అదనపు డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకుంటే దిగండి అంటూ దురుసుగా మాట్లాడారు. ప్రైవేట్‌ వాహనాల్లో ఇష్టానుసారంగా అదనపు డబ్బులు వసూలు చేశారు. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు రూ.100 నుంచి రూ.140 వరకు తీసుకున్నారు.
 
50శాతం మేర నడిచిన బస్సులు 
సమ్మె ప్రభావంతో మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 50శాతం మేర బస్సులు నడిచాయి. ఉదయం 9 గంటల వరకు అరకొర బస్సులు మాత్రమే నడవగా మధ్యాహ్నం 40 శాతం వరకు బస్సులు రోడ్డెక్కెయి. 5గంటల వరకు రీజియన్‌లో 835 బస్సులకు 431 బస్సులు నడిచాయి. మహబూబ్‌నగర్‌ డిపోలో 131 బస్సులకు 89 బస్సులు, నారాయణపేట డిపోలో 112 బస్సులకు 57 బస్సులు నడిచాయి. నారాయణపేట డిపోలో ఉన్న మొత్తం 78 ఆర్టీసీ బస్సులకు కేవలం 30, అద్దె బస్సులలో 34కు 27 బస్సులు నడిచాయి. వీటిలో హైదరాబాద్‌కు 13, పరిగి–హైదరాబాద్‌కు ఒకటి, మక్తల్‌కు 6, కోస్గికి 6, మహబూబ్‌నగర్‌ రూట్‌లో 4 బస్సులను తిప్పారు. వీటితో పాటు ప్రైవేటు బస్సులు సైతం ట్రాఫిక్‌ ఉన్న మార్గాల్లో సొంతంగా నడిపించుకున్నారు. అయి తే డిపోలో పని చేస్తున్న 160మంది డ్రైవర్లు, 204 మంది కండక్టర్లు, 65 మంది గ్యారేజీ సిబ్బందితో పాటు మరో 15 మంది సూపర్‌వై జర్లు పూర్తిగా విధులకు దూరంగా ఉన్నారు. దీంతో డీఎం సూర్యప్రకాష్‌రావు  30 మంది డ్రైవర్లు, 30 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించుకున్నారు.
  
కలెక్టర్, ఎస్పీ సమీక్ష.. 
మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ప్రయాణికుల కోసం నడుస్తున్న బస్సుల వివరాల గురించి సంబంధిత ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా ఎప్పటికప్పుడు డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు చేయాలని కోరారు. ఆయన వెంట డీవీఎం రమణ ఇతర అధికారులు ఉన్నారు. నారాయణపేట కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ చేతన ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ రాజులతో పర్యవేక్షించారు. సమ్మె పరిస్థితిపై డీఎం సూర్యప్రకాష్‌రావు, ఆర్టీసీ అధికారి చిరంజీవులు, డీఈఓ రవీందర్‌తో పాటు ప్రైవేటు స్కూల్‌ యాజమాన్య సభ్యులతో శని వారం సమీక్షించారు. ఈ సందర్భంగా సంస్థ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు, డ్రైవర్లను వాడుకోవాలని సూచించారు. టికెట్లు లేకుండా పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అన్ని రూట్‌లలో పూర్తి సర్వీసులు నడిపించాలని ఆదేశించారు. ఎస్పీ చేతన మాట్లాడుతూ టెస్ట్‌ డ్రైవ్‌ లేకుండా బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో రోడ్లపైకి పంప డం సరికాదని, తప్పకుండా ఆర్టీఏ అధికారులు   డిపో ఆవరణలో నిర్వహించాలన్నారు. 

గంట ముందు రావాల్సి వచ్చింది  
సమయానికి విధులకు చేరాల్సి ఉండటంతో రోజువారి సమయానికి కాకుండా సమ్మె కారణంగా గంట ముందు ఇంట్లో నుంచి బయల్దేరి రావాల్సి వచ్చింది. ఉదయం మా రూట్‌లో బస్సులు రాకపోవడంతో చాలా సమయం పాటు ఎదురుచూసి ఆటోలో నారాయణపేటకు వచ్చాను. తిరుగు ప్రయాణానికి బస్సు ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాను.  – రాణిదేవి, ఉద్యోగి, ఊట్కూర్‌   

మరిన్ని వార్తలు