విద్యార్థులు చస్తున్నా పట్టించుకోరా..?!

25 Sep, 2019 08:15 IST|Sakshi

లక్సెట్టిపేట(మంచిర్యాల) : వసతిగృహాల్లో విద్యార్థులు మరణిస్తున్నా... తీవ్ర విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. సీజనల్‌ వ్యాధులతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తూ ఇళ్ళకు పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఉన్నత అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకుండా పోయింది. అపరిశుభ్రంగా గదులు, బాత్‌రూంలు, టాయిలెట్లు విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నాయి. జిల్లా మొత్తంగా రెగ్యూలర్‌ వార్డెన్‌లు, హెడ్‌మాస్టర్‌లు లేక ఇన్‌చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి. అధికారులు పట్టించుకుని విద్యార్థులకు  న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇబ్బందుల్లో విద్యార్థులు 
జిల్లాలో మొత్తంగా 10 బాలుర, 6 బాలికల ఆశ్రమ పాఠశాలులున్నాయి. ఇందుకు ఆరుగురు రెగ్యూలర్‌ వార్డెన్‌లు, 10 మంది ఇన్‌చార్జి వార్డెన్‌లు ఉండగా ముగ్గురు రెగ్యూలర్, 13మంది ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్‌లు ఉన్నారు. ఎటీడబ్లూవో ప్రతి నెలకు రెండుసార్లు పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు రుచికరమైన భోజనం అందిస్తున్నారా తెలుసుకోవాలి. సీజనల్‌ వ్యాధులు వచ్చినప్పుడు విద్యార్థులు అన్ని విధాలా చికిత్సలు అందించాలి.

ఇటీవల స్థానిక పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి శివశంకర్‌ ఆకస్మత్తుగా మృతిచెందడంతో మిగతా విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. పలువురు విద్యార్థులు వ్యాధులతో ఇళ్ళలోకి వెళ్తున్నారు. దీంతో ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పరిశుభ్రత పాటించకుండా వ్యాధులపై అవగాహన కల్పించకుండా హెల్త్‌ క్యాంపులు చేపట్టకుండా కాలం వెల్లదీస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు. 

అధ్వానంగా పట్టణ పాఠశాల
మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటారు. మొత్తంగా 141మంది విద్యార్థులకు నలుగురు వెళ్లిపోగా ప్రస్తుతం 137మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతోంది.  సీజనల్‌ వ్యాధులు రావడంతో 105 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉండగా మిగతా వారు ఇంటికి వెళ్లినట్లు వార్డెన్‌ చెప్పారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడం, టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం, డార్మిటరీ గదులు ఇరుకుగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విద్యార్థి శివశంకర్‌ మృతిచెందడంతో పాఠశాల వార్డెన్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేసి హెడ్‌మాస్టర్‌ రవీందర్‌కు బాధ్యతలు ఇచ్చారు.

ఇక్కడ విధులు నిర్వహించిన ఏఎన్‌ఎంను విధుల నుంచి తొలగించడంతో ప్రస్తుతం విద్యార్థులను పరిశీలించేందుకు ఏఎన్‌ఎం లేదు. రాత్రివేళ అత్యవసర పరిస్థితి వస్తే ఇబ్బంది పడాల్సిందే. 6వ తరగది విద్యార్థి చరణ్‌ పాఠశాల నచ్చడం లేదంటు పారిపోయి దినమంతా ఒంటరిగా తిరిగి రాత్రివేళ ఇంటికి చేరడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాల విద్యార్థి ఉదయం వెళ్లిపోయిన సిబ్బందికి తెలియకపోవడం శోచనీయం.  తదుపరి ఉదయం పాఠశాలకు వచ్చి పాఠశాల నచ్చడం లేదంటూ టీసీ తీసుకునివెళ్లిపోయాడు. విద్యార్థులకు జ్వరాలు వచ్చిన సమాచారం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు