ఐలోని జాతరకు అధికారిక గుర్తింపు

20 Nov, 2014 03:29 IST|Sakshi
ఐలోని జాతరకు అధికారిక గుర్తింపు

ఐనవోలు(వర్ధన్నపేట) : జానపదుల జాతరగా ప్రసిద్ధిచెందిన ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. మండలంలోని ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన యాదవుల ఇలవేల్పు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతాయి.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ జాతరను తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా ప్రభుత్వమే వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ రెండు రోజుల క్రితం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతర ఏర్పాట్లపై సమీక్ష జరిపి అవసరమైన నిధులు సమకూర్చాలని కలెక్టర్ కిషన్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జాతర నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.
 
అభివృద్ధి పనులు వేగవంతం
వచ్చే ఏడాది జనవరి 13, 14, 15 తేదీల్లో ఐలో ని మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండగా ముఖ్యమంత్రి నిర్ణయంతో అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంది. ఆలయం ఎదురుగా ఉన్న నృత్యమండపం ప్రాంగణంలో కుడా ఆధ్వర్యంలో రూ.16 లక్షలతో చేపట్టిన ఫ్లోరింగ్ పనులు మూడు నెలలుగా కొనసాగుతున్నాయి.

ఆలయ ప్రధా న ద్వారం కుడివైపు కూడా రూ. 21.5 లక్షలతో ఫ్లోరింగ్ పనులకు టెండర్లు పిలిచారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి దర్పణంగా ఉన్న కాకతీయ కళాతోరణం, నృత్యమండపం, ఆలయ కట్టడానికి నష్టం వాటిల్లకుండా అభివృద్ధి పనులు నిర్వహించడానికి పురావస్తుశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 
నృత్య మండపంపై ప్రత్యేక దృష్టి
ఆలయం ఎదురుగా పూర్తిగా శిథిలావస్థకు చేరిన నృత్య మండపాన్ని ఇప్పటికిప్పుడు పూర్తిగా అభివృద్ధి చేయడం సాధ్యం కాకపోనా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. ఆలయంలో నూతనంగా గాలిగోపురం నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న కల్యాణ కట్ట నిర్మాణం పూర్తి చేసేలా పురావస్తుశాఖ అధికారులు ముందుకెళ్తున్నారు.
 
ప్రత్యేక స్నానఘట్టాలు
జాతరకు లక్షకు పైగా భక్తులు రానుండడంతో స్నానఘట్టాలను నిర్మించే చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ సమీపంలోని వడ్లవానికుంట లోకి దేవాదుల నీటిని విడుదల చేసి కట్టకు శాశ్వత స్నానఘట్టాలను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. మేడారం జాతరలాగా బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌ను ఏర్పాటు చేసేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
 
ఎంపీ దత్తత గ్రామంగా ఐనవోలు..
సంసద్ గ్రామీణ యోజన పథకంలో ఐనవోలు గ్రామాన్ని ఎంపీ కడియం శ్రీహరి దత్తత తీసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రయాణం సులభతరం చేయడానికి ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. రూ.8 కోట్లు ఆర్‌ఆండ్‌బీ నిధులతో పెద్దపెండ్యాల, వెంకటాపూర్, ఐనవోలు, పున్నేలు రహదారిని విస్తరించే పనులను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంతోపాటు గ్రామంలో 132/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే రమేష్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు