ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన యంత్రాంగం

16 Sep, 2019 10:51 IST|Sakshi

లెక్క తేల్చే పనిలో నిమగ్నం

పూర్తి కాగానే ప్రభుత్వానికి నివేదిక

గతంలో నిర్వహించిన సర్వేలో వెలుగుచూసిన అక్రమాలు

ఆక్రమణలో సుమారు 3,370 ఎకరాల భూమి!

హెచ్‌ఎండీఏ మండలాల్లో ఎక్కువగా కబ్జా

సాక్షి, యాదాద్రి: జిల్లాలో ప్రభుత్వ భూములెన్ని.. వివిధ అవసరాల నిమిత్తం ఎంత అసైన్డ్‌ చేశారు.. ప్రస్తుతం ఉన్నదెంత.. లేకపోతే ఎటుపోయింది.. లెక్క తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ భూముల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా హైదరాబాద్‌ శివారులో గల మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వీటితో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆక్రమణకు గురయ్యాయి. దీంతో లెక్కలు తేల్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 

వెంచర్లుగా మారిన ప్రభుత్వ భూములు
వ్యవసాయం, గృహ, సామూహిక ప్రజా అవసరాలు, ప్రభుత్వ అవసరాలకోసం ప్రభుత్వ భూములను అసైన్‌ చేశారు. ఇందులో వ్యవ సాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవడమే కాకుండా  క్రయవిక్రయాలు జరిగాయి. జిల్లాలో వైటీడీఏ, బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతోంది. పునరావాసం కింద బాధితులకు తిరిగి ప్రభుత్వం భూములను ఇవ్వాల్సి ఉంది. మరో వైపు ఇప్పటికే అసైన్‌ చేసిన భూములు కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ముసుగులో భారీగా ప్రభుత్వ అసెన్‌ భూములు కొల్లగొట్టారు. ఆక్రమణలను అడ్డగించేవారు లేకపోవడంతో కోట్లాది రూపాయల విలువగల భూములను రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసి విక్రయించారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో గల ప్రభుత్వ అసైన్డ్‌  భూములను రియల్టర్లు కబ్జా చేసి ఓపెన్‌ప్లాట్ల వ్యాపారం చేశారు. నిరోధించాల్సిన యంత్రాంగ చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. ప్రభుత్వం గతంలో భూముల లెక్కలు తేల్చడానికి సర్వే చేపడితే వందకోట్ల రూపాయలు విలువ చేసే భూములు కబ్జా, ,క్రయవిక్రయాలు జరిగినట్లు తేలింది.  క్షేత్రస్థాయిలో సరైన రక్షణ లేకపోవడంతో జిల్లాలోని 17 మండలాల్లో  కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేసి అందినకాడికి ఆక్రమించి అమ్ముకున్నారు.  జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.100కోట్లకు పైగా  విలువ చేసే 3,370 ఎకరాల భూములను ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది.  

రూ.కోట్లల్లో డిమాండ్‌
హెచ్‌ఎండీఏ, మూసీ పరివాహక ప్రాంతం, యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి రెండు జాతీయ రహదారులు  ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎకరం భూమి ధర రూ.కోట్లకు చేరింది.  చౌటుప్పల్‌ డివిజన్‌లో పరిధిలో 33.608, భువనగిరి డివిజన్‌లో 49.604  ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చౌటుప్పల్‌ డివిజన్‌లో 14,140.32 ఎకరాల భూమిని, భువనగిరి డివిజన్‌లో 23693 ఎకరాల భూమిని రైతులకు అసైన్డ్‌ చేశారు. 

సగానికి పైనే అన్యాక్రాంతం
ప్రభుత్వం అసైన్డ్‌ చేసిన భూములు సగానికి పైగా అన్యాక్రాంతమయ్యాయి. ఆభూముల పక్కనే గల భూములను కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించారు. గతంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల సర్వేలో భూ ఆక్రమణలు బయటపడ్డాయి. ఈమేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపారు.  రాజకీయ వత్తిడులు, కొందరు ఉన్నతాధికారులప్రమేయంతో ఖబ్జాభూములపై నివేదికలన ప్రభుత్వానికి పంపించారు.   

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కేసులు నమోదు
అసైన్‌ చేసిన భూ ముల క్రయవిక్రయాలు జరిగితే పీఓటీ కేసులు నమోదు చేస్తాం. అలాగే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం హైదరాబాద్‌ శివారులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తోంది. ప్రభుత్వం లెక్కలు తీస్తున్న జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా లేదు. ఇక్కడ బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ భూములు అవసరం ఉన్నాయి. 
    –రమేశ్, జాయింట్‌ కలెక్టర్‌

ప్రభుత్వ భూముల వివరాలు ఎకరాల్లో

మండలం మొత్తం ఏరియా వ్యవసాయానికి కేటాయింపు
ఆలేరు 3794.08 1457.22
ఆత్మకూరు 8512.05     4302.09
భువనగిరి        8450.05 3341.19
బీబీనగర్‌         5544.21 1884.07
బి.రామారం         6698.16 1831.06
మోత్కూర్‌         8997.10 4426.23
రాజాపేట       4358.17  2346.34
తుర్కపల్లి         10920.03 4078.29
యాదగిరిగుట్ట         4618.22 1938.24
చౌటుప్పల్‌         8057.33 2748.14
పోచంపల్లి         6707.15 5767.74
గుండాల         6094.06 2492.07
రామన్నపేట         7561.02 2830.26
వలిగొండ         7351.345 3218.03
మొత్తం         97665.18 39664.08 
మరిన్ని వార్తలు