అక్రమ కట్టడాలపై అధికారుల పంజా

24 Feb, 2018 09:17 IST|Sakshi
అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న దృశ్యాలు

345 సర్వేనంబర్‌లో కబ్జాదారులను ఖాళీ చేయించిన పోలీసులు

ఉదయం 3గంటల నుంచే ఆపరేషన్‌ ప్రారంభం

మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన  అక్రమ కట్టాడాలపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ శివారులో ఉన్న 345 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసి భూ పోరాటంలో భాగంగా నిరుపేదలు  తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. మరి కొంత మంది రియల్‌మాఫియాకు చెందిన వారు పక్కాగా నివాస గృహాలు నిర్మించారు. జిల్లాలో జరుగుతున్న భూ పోరాటం ముఖ్యమంత్రి వరకు చేరుకోవడంతో అధికారుల్లో  కదలిక మొదలైంది. అక్రమ కట్టాడాలు నిర్మించుకున్న వారితో, వారిని ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులతో  అధికారులు పలుమార్లు  చర్చలు జరిపారు, ప్రభుత్వ స్థలాలను ఖాళీ చేయాల్సిందేనని హెచ్చరించారు. శుక్రవారం సుమారు 5వందల మంది పోలీస్‌  బలగాలతో రెవెన్యూ అధికారులు దగ్గరుండి అక్రమ కట్టాడాలను కూల్చి వేశారు.

ఉదయం3 గంటల నుంచి..
డీసీపీ వేణుగోపాల్‌రావు, జేసీ సురేందర్‌రావులు పోలీసుల బలాగాలు, ఫారెస్టు, ఎక్సైజ్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటి, ఫైర్‌ సిబ్బందితో ఉదయం 3 గంటల నుంచే గుడిసెల కూల్చివేతకు ఆపరేషన్‌ ప్రారంభించారు. ఆక్రమితదారులను ప్రోత్సహిస్తున్నారన్న సమాచారం మేరకు అనుమానితులను 20 మందిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారు రెండు గంటల్లో ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు. అనంతరం అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన ఇళ్లను నాలుగు జేసీబీలతో కూల్చి వేశారు. ఈక్రమంలో అడ్డుపడిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠినచర్యలు
345 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమి 330.09 ఎకరాలు ఉండగా 120 ఎకరాలు జంగు సిపాయినకు, మరో 20 ఎకరాలు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు, లొంగిపోయిన మావోయిస్టులకు, 12 ఎకరాలు డబుల్‌ బెడ్‌రూం, సుమారు 90 ఎకరాల భూమి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ నివాస గృహాలకు వివిధ దశలలో కేటాయించాం. జంగు సిపాయికి చెందిన భూమిలో 60 ఎకరాల భూమికి సబ్‌డివిజన్‌ కలదని, దీనిని ఆసరాగా చేసుకుని పలువురు భూఆక్రమణ దారులు మిగిలిన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. వీటిలో నివాస స్థలాలు, నివాస గృహాలకు అర్హులైన వారిని గుర్తించి డబుల్‌ బెడ్‌రూం పథకంలో ఇల్లు కేటాయిస్తాం.  – సురేందర్‌రావు, జేసీ, మంచిర్యాల

మరిన్ని వార్తలు