దేవుడు ఎదురుచూడాల్సిందే!

18 Apr, 2019 05:56 IST|Sakshi
సర్వతోభద్ర ఆలయంలో కొలువుదీరిన సీతారామ లక్ష్మణుడు

సర్వతోభద్ర ఆలయ పునరుద్ధరణలో అధికారుల అలసత్వం

దేవాదాయ శాఖ నుంచి లేఖ రావాలంటూ తప్పించుకుంటున్న వైనం

పునరుద్ధరణకు ఏడాదిన్నర క్రితం నాటి స్పీకర్‌ నిధుల కేటాయింపు

పనులు మొదలయ్యే వేళ సాంకేతిక అంశాల సాకుతో పెండింగ్‌

ఒక్క ఫోన్‌ కాల్‌తో పరిష్కరించే వీలున్నా... ఫైల్‌ను అటకెక్కించిన వైనం

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటిష్‌ కాలం నాటి విధానాలు ఇంకా ఎందుకంటూ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ శాఖలను సంస్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని మార్చే ప్రయ త్నంలో ఉన్నారు. కానీ, ఉన్నతాధికారులు మాత్రం పాత విధానాలను వీడక అభివృద్ధి పనులకు ఆటంకంగా మారుతున్నారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో పరిష్కారమయ్యే అంశాలను కూడా ఏళ్లతరబడి ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతున్నారు. వీరి నిర్లక్ష్యానికి..  ఆరొందల ఏళ్ల క్రితం నాటి అద్భుత ఆలయమే సజీవ సాక్ష్యం. ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ ఆలయ ప్రత్యేకతలను ఏడాదిన్నర క్రితం అమెరికా పరిశోధకుడు వెలుగులోకి తెచ్చారు.

అంతకుముందు పురావస్తుశాఖ అధికారులు దీన్ని ప్రత్యేక నిర్మాణంగా గుర్తించినా, దేశంలో మరెక్కడా ఈ తరహా ఆల యాలు లేవన్న సంగతిని మాత్రం అమెరికా పరిశోధకుడు తేల్చాడు. శిథిలావస్థకు చేరుతున్న ఆలయానికి పూర్వ వైభవం కల్పించేందుకు నాటి శాసనసభాపతి మధుసూదనాచారి రూ.3 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే అధికారులు మాత్రం వివిధ కారణా లు చూపి ఇప్పటికీ పనులు సాగనివ్వడం లేదు. నిధు లుండి, పనిచేసే విభాగాలు ఆసక్తిగా ఉన్నా, ఉన్నతాధికారులు ఫైలును దగ్గర పెట్టుకుని, మన పాలన విధానాల డొల్లతనాన్ని చాటి చెబుతున్నారు. వీరి తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ.. ఈ ఆలయ ప్రత్యేకతను జనం ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో.. ‘ఇంటాక్‌’సంస్థ సభ్యులు గురువారం ఆ ఆలయం వద్ద ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  

గుట్ట రాయి గుడిగా మారి.. 
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నయన్‌పాక గ్రామ శివారులో ఉందీ దేవాలయం. దాదాపు 50 అడుగుల ఎత్తుతో గుట్ట రాయి మీద భారీ గర్భాలయం ఒక్కటే నిర్మితమై ఉంది. ముందు ఎలాంటి మండపాలు లేవు. ఎవరి హయాంలో నిర్మించారో స్పష్టమైన ఆధారాలు తెలిపే శాసనాలు అందుబాటులో లేవు. దీనికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలున్నాయి. ఆలయం మధ్యలో.. అదే గుట్టరాయికి మూలవిరాట్టు చెక్కి ఉంది. ఆ విగ్రహాలు విడిపోయి కాకుండా గుట్టలో భాగంగానే ఉండటం విశేషం. దాదాపు నాలుగున్నర అడుగుల ఎత్తుండే ఆ మూల విరాట్టు నాలుగు వైపులా నాలుగు రూపాల్లో ఉంది.

తూర్పు ద్వారం నుంచే వెళ్తే లక్ష్మీ సమేత నారసింహుడు, పశ్చిమం వైపు ద్వారం నుంచే చూస్తే నాగలి ధరించిన బలరాముడు, ఉత్తర ద్వారం నుంచి చూస్తే సీతారామలక్ష్మణులు, దక్షిణం ద్వారం నుంచి వేణుగోపాల స్వామి రూపాలు కనిపిస్తాయి. ఇలా నాలుగు ద్వారాలు, ఒకే రాయికి నాలుగు వైపులా నాలుగు రూపాల్లో విగ్రహాలు ఉండటం సర్వతోభద్ర ఆలయంగా పేర్కొంటారు. ఇలాంటి భారీ దేవాలయం ఇప్పటివరకు ఎక్కడా వెలుగు చూసిన దాఖలాలు లేవని 2017 నవంబర్‌లో ఈ ఆలయాన్ని గుర్తించిన అమెరికా పరిశోధకుడు ఫిలిప్‌ బి.వ్యాగనార్‌ పేర్కొన్నారు. అప్పట్లో ఈ మొత్తం విశేషాలను ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. దీంతో నాటి స్పీకర్‌ మధుసూదనాచారి ఆలయ పరిరక్షణ, అభివృద్ధికి రూ.3 కోట్లు విడుదల చేశారు. అది ఆలయం కావటంతో దేవాదాయశాఖకు నిధులు ఇచ్చారు.

కానీ, చారిత్రక నిర్మాణం అన్న స్పృహ, అవగాహన లేని దేవాదాయ శాఖ అధికారులు, ఆ రాతి నిర్మాణాన్ని కొంతమేర తొలగించి సిమెంటుతో పునర్నిర్మించటం, దిగువ ఉన్న గుట్ట రాయిని తొలిచి అంతా సిమెంటు చేయటం, ఆలయానికి ఆనుకుని కాంక్రీటు మండపం నిర్మించేందుకు సిద్ధమై పనులు ప్రారంభించారు. విషయం తెలిసిన పురావస్తు శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం చెప్పటంతో ఆపేశారు. చాలా గొప్ప నిర్మాణం అయినందున కాంక్రీటు లేకుండా రాతి నిర్మాణమే జరపాలని పేర్కొనటంతో నాటి స్పీకర్‌ మధుసూదనాచారి ఆ పనులు పురావస్తుశాఖనే చేపట్టాలని సూచించారు. ఇక అంతే, అధికారుల్లో వేళ్లూనుకున్న నిర్లక్ష్యం బయటపడింది. అప్పుడు ఆగిపోయిన పనులు ఇక మళ్లీ మొదలు కాలేదు.  

నారసింహుడు, వేణుగోపాలస్వామి

ఓ ఫోన్‌ కాల్‌తో అయిపోయే దానికి... 
ఆ నిధులు తమకు అప్పగిస్తే పనులు చేపడతామని పురావస్తుశాఖ అధికారులు దేవాదాయ శాఖను కోరారు. దీనికి వారు సమ్మతించారు. కానీ, అప్పటికే తాము టెండర్‌ పిలిచి నిర్మాణ సంస్థను గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సంస్ధ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టాలా, కొత్తగా టెండర్లు పిలవాలా అన్న విషయంలో పురావస్తు శాఖకు స్పష్టత రాలేదు. దీంతో విషయం తేల్చాలంటూ సచివాలయానికి అధికారులు లేఖ రాశారు. అక్కడి అధికారులు దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుని పురావస్తు శాఖ అధికారులకు స్పష్టత ఇవ్వాలి. కానీ, దేవాదాయ శాఖ నుంచి లిఖితపూర్వకంగా ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొంటూ ఏ నిర్ణయం తీసుకోకుండా ఫైలును అటకెక్కించి చోద్యం చూస్తున్నారు.

అప్పట్లోనే పనులు మొదలై ఉంటే ఈ పాటికి పూర్తయి అద్భుత దేవాలయానికి శిథిలావస్థ బెడత తప్పి ఉండేది. ఆలయ శిఖరం వద్ద ఉన్న ఇటుకలు దెబ్బతినటంతో వానలు కురిస్తే నీళ్లు లోనికి చేరి కట్టడం క్రమంగా పాడవుతోంది. రాళ్లు కూడా కదిలిపోతున్నాయి. వెంటనే పనులు చేపట్టకపోతే ప్రధాన నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో రూ.13 లక్షలతో ఆలయానికి ప్రహరీగోడ, రూ.45 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారని ఆలయ పూజారి పెండ్యాల ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఇక పనుల్లో జాప్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టాలని పురావస్తుశాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు