లక్ష్యం చేరని చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం

3 Oct, 2019 11:18 IST|Sakshi
చంద్రఘడ్‌ ప్రధాన ఎత్తిపోతల పంప్‌హౌస్‌

15 వేల నుంచి సగానికి తగ్గిన ఆయకట్టు

ప్రస్తుతం కేవలం 2 వేల ఎకరాలకే పరిమితం

ఎగువ పరీవాహక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు కావాల్సినంత నీరు వచ్చి చేరింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాలు విజయవంతంగా సాగుతున్నాయి. దీంతో ఆయకట్టు దారులు ఈ ఏడాది రెట్టింపు సాగు చేశారు. కానీ నర్వ మండలంలోని చంద్రఘడ్‌ ఎత్తిపోతలను పాలకులు, అధికారులు విస్మరించడంతో ఈ ప్రాంత రైతులకు నిరాశే మిగిలింది. 

సాక్షి, నారాయణపేట: రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం డీలా పడిపోయింది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా సాగునీరుకు నోచుకోక వేల ఎకరాలన్ని బీడు భూములుగా మారాయి. మండలానికి మంజూరైన ప్రధాన ఎత్తిపోతలు చంద్రఘడ్, కొండాదొడ్డి ఎత్తిపోతల పథకాలు కాంట్రాక్టుల కక్కుర్తికి ఏడాది కూడా నడవని పరిస్థితి దాపురించింది. కొండాదొడ్డి మూత పడగా, చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం పరిస్థితి కూడా అలాగే అయ్యేలా ఉంది. 

ముచ్చటగా మూడు లిఫ్టులు.. 
చంద్రఘడ్‌ ఎత్తిపోతలలో ప్రధానంగా మూడు లిప్టులు ఉన్నాయి. ఇందులో చంద్రఘడ్‌ కింద 5 వేల ఎకరాలు, నాగిరెడ్డిపల్లి కింద 5 వేలు, బెక్కర్‌పల్లి కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2005 సంవత్సరంలో వీటి పనులను చేపట్టారు. ఇందుకుగాను ఒక్కో ఫేజుకు 5 వేల ఎకరాలతో 15 వేల ఎకరాల లక్ష్యంతో పనులను రూ.58 కోట్లు కేటాయించగా ఇందులో నాబార్డు ద్వారా రూ.36 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.18 కోట్లతో అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 18 నెలల గరిష్ట గడువుతో ఓ ప్రముఖ కంపెనీ పనులను చేపట్టింది. ఇందులో నాబార్డు ద్వారా రూ.36 కోట్లు మంజూరుకాగా ఈ నిధులతో పనులను చేపట్టిన కంపెనీ కృష్ణానది నిల్వ నీటి వద్ద పంప్‌హౌస్‌ నిర్మాణం, విద్యుత్‌ ఉపకేంద్రం, చంద్రఘడ్‌ పథకం మూడు దశలకు అందజేసే పంప్‌హౌస్‌కు పైప్‌లైన్‌ పనులు చేపట్టింది. అప్పట్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రధాన కంపెనీ పనులు నాసిరకంగా చేయడంతో ప్రారంభంలో ట్రయల్‌ రన్‌లోనే చాలా చోట్ల పైపులు పగిలిపోయాయి. 

నిధుల అడ్డంకితో.. 
నాబార్డు ద్వారా మంజూరైన రూ.36 కోట్లను సింహబాగం పైప్‌లైన్‌ కొనుగోలు కోసం ఖర్చుచేశారు. చిన్న నీటి పారుదల సంస్థ నుంచి  నిధులు విడుదల జాప్యంతో కాంట్రాక్టర్లు పనుల కోసం అదనపు నిధులు వ్యయం చేశారు. దీం తో ఐడీసీ అధికారులు అనేక మార్లు నిధుల విడుదల కోసం ప్రతిపాదనలు పంపినా ఏడేళ్ళ వరకు నిధుల కేటాయింపులే లేవు. దీంతో అదనపు కేటాయింపులు లేక పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెనకాడారు. తదనాంతరం ప్రభుత్వం నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలకు రూ.4.76 కోట్లు, చంద్రఘడ్‌కు రూ.4.95 కోట్లు, బెక్కర్‌పల్లికి రూ.5.66 కోట్ల చొప్పున నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గతంలో అదనపు పనుల చేసిన వాటికి బిల్లులు పోను మిగిలిన నిధులతో పనులను ప్రారంభించారు.  

15 వేల నుంచి 9,770 ఎకరాలకు.. 
జీఓ ఆర్‌టి 986 ప్రకారం నవంబర్‌ 4, 2012న ప్రభుత్వం ఈ మూడు లిఫ్టుల ఆయకట్టును 15 వేల నుంచి 9,770 ఎకరాలకు తగ్గించింది. ఇందులో 9,770 ఎకరాల భూమి ఐడీసీ స్కీం, రాజీవ్‌భీమ లిఫ్టు సంగంబండ రిజర్వాయర్, భూత్పూరు రిజర్వాయర్‌ ఆయకట్టు కింద ఉన్నదని గ్రహించి రెండు శాఖల సమన్వయం లేనందున ఈ జీఓ ద్వారా రాజీవ్‌ భీమ లిఫ్టు ఆధీనంలో కాలువలు పూర్తిచేసి ఐడీసీ వారికి ఇచ్చేందుకు ఆదేశాలు జారిచేసింది.  

రాజీవ్‌ భీమానా..? ఐడీసీనా..? 
రైతులు ఉన్న 9,770 ఎకరాల భూమికి ఐడీసీ నుంచో రాజీవ్‌ లిఫ్టు నుంచి నీరు కోరుకుంటే ఇందులో ఒక తిరకాసు ఉంది. ఐడీసీ నుంచి కాలువలు ఏర్పాటైతే పంట కాలువలకు భూమి నష్ట పరిహారం చెల్లించరు. రాజీవ్‌ లిఫ్టు నుంచి నీరు కోరుకుంటే రైతుల పొలాలకు నష్ట పరిహారం వస్తుంది. దీంతో రైతులు రాజీవ్‌లిఫ్టు వైపే మొగ్గు చూపారు. కానీ ల్యాండ్‌ యాక్వేషన్‌ లేకపోవడంతో నష్టపరిహారం రాదని పిల్లకాల్వల తవ్వేందుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు. 

మేజర్‌ ఇరిగేషన్‌లో  కలపాలి  
1500 హార్స్‌పవర్స్‌ కలిగిన మోటర్లను రైతులే నిర్వహణ చేయాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పథకాన్ని మేజర్‌ ఇరిగేషన్‌లో కలిపితేనే నిర్వాహణ సాధ్యమవుతుంది. కనీసం ఒక్క మాన్‌సూన్‌లోనైన పూర్తి ఆయకట్టుకు నీరు ఇవ్వలేక పోతున్నాం. దీంతో రైతులు నిర్వాహణకు డబ్బులు కట్టడం లేదు. ఎమ్మెల్యే నిధులను వాడుకునేందుకు అధికారులు ఎస్టిమేషన్‌ వేయడంలేదు. దీంతో అడుగడుగున లీకేజీలతో ఈ ఖరీఫ్‌లో సాగు కష్టమే అనిపిస్తుంది.  
– సత్యనారాయణరెడ్డి అధ్యక్షుడు, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకం 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు