సాకులు చెప్పొద్దు..

23 Apr, 2019 14:08 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

 ప్రజావాణికి అధికారులంతా హాజరుకావాలి

ఇకపై ప్రతీ సోమవారం  గ్రీవెన్స్‌ ఉంటుంది

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

హన్మకొండ అర్బన్‌ : ‘ఇకపై ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది.. అన్ని శాఖల అధికారులు హాజరుకావాలి.. సాకులు చొప్పొద్దు’ అని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అధికారులు ఎక్కువ మంది రామకపోవడంపై ఆరాతీసి హాజరు వివరాలను పరిశీలించారు. జెడ్పీ సమావేశం ఉండటంతో చాలా మంది అక్కడికి వెళ్లినట్లు అధికారులు తెలుపగా ఇకపై అధికారులు తప్పనిసరిగా గ్రీవెన్స్‌కు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖలకు సంబంధించిన రాయితీ డబ్బులు నెల రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసినా యూనిట్లు ఎందుకు గ్రౌండింగ్‌ చేయాలేదని అధికారులను ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్‌ మంగళవారం సాయంత్రం పత్య్రేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంటూ రుణాల గ్రౌండింగ్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. అలాగే ఎంజీఎంలో సదరం క్యాంపుల నిర్వహణ, సర్టిఫికెట్ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

గ్రీవెన్స్‌కు హాజరైన వివిధ శాఖల అధికారులు

సదరం సర్టిఫికెట్‌ ఇప్పించండి
తనకు ఆరు నెలల క్రితం పక్షవాతం రావడంతో రెండు కాళ్లు పూర్తిగా పనిచేయడం లేదు. మంచానికి పరిమితమయ్యాను. సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేసి పెన్షన్‌ ఇవ్వాలని కోరుతూ ధర్మసాగర్‌ మండలం ముప్పారం గ్రామానికి చెందిన సులువూరి లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు.

ఆలయ భూమిని కబ్జా చేస్తున్నారు
హన్మకొండలోని వరంగల్‌ అర్బన్‌ ఆర్డీఓ కార్యాలయం సమీపాన 1145 సర్వే నంబర్‌లో ఉన్న కాకతీయుల కాలంనాటి బాలరాజరాజేశ్వర స్వామి దేవాలయం భూమిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వారు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు. ఈవిషయంలో అధికారులు సత్వరం చర్యలు తీసుకుని సుమారు 26 గుంటల భూమి కాపాడాలని కాయతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ చీకటి రాజు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు