వేటాడింది ఐదు.. పట్టుకున్నవి రెండు

22 Mar, 2017 04:05 IST|Sakshi
వేటాడింది ఐదు.. పట్టుకున్నవి రెండు

మహదేవపూర్‌ అడవుల్లో జింకల్ని వేటాడింది రెండు బృందాలు
అటవీ సిబ్బందికి దొరికినవి రెండు జింకల కళేబరాలే
మరో మూడింటిని అడవిలోకి విసిరేసి పరారైన వేటగాళ్లు!
ఐదుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు


మహాదేవపూర్‌ (మంథని): భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ అడవుల్లో ఆదివారం రాత్రి వేటగాళ్లు రెండు కాదు... ఐదు జింకలను వేటాడినట్లు తెలుస్తోంది. రెండు బృందాలు ఈ వేటలో పాల్గొనగా.. ఓ బృందం రెండు జింకలను, మరో బృందం మూడు జింకలను వేటాడినట్లు అనుమానిస్తున్నారు. మూడు జింకల కళేబరాలను అడవిలోనే విసిరేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వేటలో స్థానిక నాయకుడితోపాటు సుమారు 14 మంది పాల్గొనగా.. 4 వాహనాలు వినియో గించినట్లు తెలుస్తోంది. రెండు తుపాకులను వాడినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. పోలీసులు, అటవీశాఖ అధికారుల సహ కారంతో కొన్నేళ్లుగా వేట నడుస్తున్నట్లు సమాచారం.

వేట సాగిందిలా..
హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు వేటగాళ్లు ఇండికా కారులో తుపా కులతో ఆదివారం మధ్యాహ్నం స్థానిక నాయకుడి రహస్య స్థావరానికి చేరుకున్నారు. స్థానిక షూటర్లు, వేట తర్వాత జంతువును హలాల్‌ చేసే వారు, కాపుకాసే వారు వేటలో సహకరించే వారు వీరికి తోడయ్యారు. ఒక మిలట్రీ జీపు, ఒక జిప్సీ క్యాంటర్‌ వాహనం, స్థానికులకు చెందిన స్విఫ్ట్‌ కారు, హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండికా కారులో అంబట్‌పల్లికి బయల్దేరారు. అంబట్‌ పల్లిలో ఇండికా కారు వదిలి.. మిగతా మూడు వాహనాల్లో పంకెన ప్రాంతం వైపు పయన మయ్యారు. స్థానిక నాయకుడు అక్కడ కూడా వ్యవసాయం చేస్తుండడంతో.. చూసిన వారు భూముల వద్దకు వెళ్తున్నారనుకున్నారు. పంకెనలో వాగు వద్ద సదరు నాయకుడి సూచన మేరకు రెండు బృందాలుగా విడిపోయి జంతువుల సంచారం ఉన్న వైపు వెళ్లారు. వేటగాళ్ల కదలికలను గమనించిన స్థానికులు కొందరు డీఎఫ్‌వోకు సమాచారం అందజేశారు. ఎర్ర జిప్సీ వాహనంలో వెళ్లిన బృందం.. రెండు జింకలను వేటాడింది.

 సర్వాయపేటలో ఉన్న మరో బృందం మూడు జింకలను వేటాడినట్లు తెలుస్తోంది. ఎర్ర జిప్సీ బృందం.. వేటాడిన రెండు జింకలతో తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో పెట్రోలింగ్‌లో పలిమెల రేంజ్‌ అధికారికి సమాచారం అందింది. దీంతో ఆయన లెంకలగడ్డ వద్ద వాహనాన్ని అటకాయించినా ఆపకుండా దూసుకెళ్లారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన మహదేవపూర్‌ రేంజ్‌ అధికారి నలుగురు సిబ్బందితో సూరారం పొలిమేరల్లో వాహనాన్ని అడ్డుగా నిలిపారు. రాపెల్లికోట మీదుగా వచ్చిన జిప్సీ వాహనం అటవీ వాహ నాన్ని ఢీకొట్టి అంబట్‌పల్లి వైపు వెళ్లింది. దీన్ని అటవీ అధికారులు వెంబడిం చారు. వెనుక సర్వాయపేట నుంచి బయల్దేరిన మరో మిలట్రీ జీపులో నుంచి మూడు జింకలను దారిలోనే అడవిలోకి విసిరి వేసినట్లు చెబుతున్నారు. జిప్సీలోని జింకలను అంబట్‌పల్లిలో ఇండికా కారు నిలిపిన ప్రదేశంలో వేటగాళ్లు గడ్డివాములోకి విసిరేశారు. అనంతరం తుపాకులతో బెదిరించి తప్పించుకునేందుకు ప్రయత్నిం చారు. అయితే అటవీ అధికారులు వారిని చాకచక్యంగా పట్టుకొని కారును, జంతువు లను స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురు వేటగాళ్లపై కేసు
జింకలను వేటాడిన ఉదంతంలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్‌ రేంజర్‌ రమేశ్‌ తెలిపారు. రెండు జింకల కళేబరాలతోపాటు స్వాధీనం చేసు కున్న సామగ్రిని మంథని కోర్టులో డిపాజిట్‌ చేశామన్నారు. కారులో లభిం చిన ఆధార్‌కార్డ్, ఫొటోల ఆధారంగా హైదరాబాద్‌లోని విజయనగర్‌ కాలనీకి చెందిన అఫ్జల్‌ అహ్మద్‌ఖాన్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు