ఐలా.. చూస్తూ ఉంటే ఎలా..?

26 Oct, 2019 06:29 IST|Sakshi
పారిశ్రామికవాడలో పన్నులు చెల్లించని భవనం ఇదే..

11 ఏళ్లుగా పన్నులు చెల్లించకుండా దర్జాగా..

నెలకు రూ.5 లక్షలకు పైగానే కిరాయిలు  

పన్ను వసూలు చేయకుండా చోద్యం చూస్తున్న అధికారులు

చింతల్‌: పన్నులు చెల్లించని వాణిజ్య సముదాయాలపై కొరడా ఝులిపించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. లక్షల్లో అద్దెలు తీసుకుని ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించని సదరు యజమానిపై గాంధీనగర్‌ ఐలా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సుమారు రూ.30 లక్షల మేర ప్రభుత్వానికి గండి పడింది. ఆర్థిక సంవత్సరం చివర్లో ఐలా అధికారుల హడావుడి అంతా ఇంతా కాదు. ఎంత హడావిడి చేసినా రూ.8, 9 కోట్లు రావాల్సిన ఆదాయం రూ.3 కోట్లకు మించి రావడం లేదు. ట్యాక్స్‌ వసూళ్ల సమయంలో హడావుడి చేసి ఒక్క రోజు గేట్లకు తాళాలు వేసి నోటీసులు ఇచ్చినా కొంతమంది భవన యజమానులు పన్నులు చెల్లించడం లేదు. గాంధీనగర్‌ ఐలా పరిధిలో 225 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో కొంతమేర 2005కు ముందు భవనాలను నిర్మించగా మరి కొంత మంది 2005 తర్వాత భవనాలను నిర్మించారు. ప్రభుత్వం ట్యాక్స్‌లను 100 శాతం మేర పెంచడంతో పారిశ్రామికవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఇందులో కొంతమంది పాత ట్యాక్స్‌ ప్రకారం చెల్లిస్తుండ గా కొందరు పారిశ్రామికవేత్తలు కేసు కోర్టు పరిధిలో ఉందన్న సాకుతో ట్యాక్స్‌లను చెల్లించడం మానేశారు. అక్కడే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నా ఐలా అధికారులు కళ్లు మూసుకున్నారు. 

ఏళ్ల తరబడి ట్యాక్స్‌ కట్టని వారిపై చర్యలేవి..?
ఐలా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పన్నులు చెల్లించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓ వ్యక్తి ఏకంగా 11 ఏళ్లలో కేవలం రూ.5 లక్షలు వరకు పన్నులు చెల్లించి మిగిలిన సొమ్మును చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. సీఐఈ గాంధీనగర్‌ పారిశ్రామికవాడలోని ప్లాట్‌ నెం 56/1, 56/2లో సదరు యజమాని 800 గజాలలో 2008లో రెండు ప్లాట్లలో కలిపి రెండు అంతస్తులు, పెంట్‌హౌజ్‌ నిర్మించి మొత్తం 30కి పైగా షెట్టర్లను వేసి లక్షల్లో అద్దెకు ఇస్తున్నాడు. 2008–19 వరకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే చెల్లించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తి మొత్తం రూ.28,67,196 లక్షల్లో బకాయిపడ్డాడు. ప్రతినెలా అతను అద్దెకు ఇస్తూ ఏకంగా రూ.5 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినా అధికారులు చోద్యం చూడటం అనుమానాలకు తావిస్తోంది. ట్యాక్స్‌ వసూళ్ల సమయంలో హడావుడి చేసే ఐలా అధికారులు ఇన్నేళ్లుగా పన్నులు చెల్లించని భవనాన్ని సీజ్‌ చేయాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇంతమేర బకాయి రూపంలో గండి పడింది. నోటీసులకే పరిమితమవుతున్న అధికారులకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఉన్న వాటిని సీజ్‌ చేసే అధికారం ఉంది. కానీ ఇక్కడ అధికారుల తీరుచూస్తుంటే మాత్రం పలు అనుమానాలకు తావివ్వక మానదు.  

రెడ్‌ నోటీసులు జారీ చేస్తాం..
గాంధీనగర్‌ పారిశ్రామికవాడలోని ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్‌ బకాయి ఉన్న సదరు భవనాల యజమానులకు రెడ్‌ నోటీసులు జారీ చేస్తామని జీడిమెట్ల ఐలా కమిషనర్‌ నజీర్‌ అన్నారు. 2005 తరువాత నిర్మించిన అన్ని భవనాల యజమానులు పూర్తిస్థాయిలో ట్యాక్స్‌ చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. బకాయి ఉన్న భవనాల వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తాం.– నజీర్, జీడిమెట్ల ఐలా కమిషనర్‌

మరిన్ని వార్తలు