అధికారులూ.. సిగ్గు సిగ్గు

23 Mar, 2019 11:35 IST|Sakshi

పార్దీల హోలీ వేడుకకు కనీస సౌకర్యాలు కల్పించని వైనం

ఆడ పడుచులు స్నానం చేయకుండా మున్సిపాలిటీ గేట్‌కు తాళం  

జల్‌పల్లిలోని రోడ్ల పక్కన, చెరువుల్లో స్నానం చేసిన మహిళలు

పహాడీషరీఫ్‌: హోలీ పండుగ వచ్చిందంటే పార్దీ కులస్థుల్లో (నక్కల పిట్టలోల్లు) ఏ ఒక్కరిని కదిలించినా జల్‌పల్లి గ్రామం పేరే చెబుతారు. తమ పూర్వీకులు మొత్తం జల్‌పల్లిలోని పిట్టలగూడెంలో ఉండి తదనంతరం నగరంతో పాటు ఇతర జిల్లాలలో పార్దీవాడలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. హోలీ సమయంలో ఏ స్థాయిలో స్థిరపడిన వారైనా జల్‌పల్లిలోని పిట్టల గూడెంకు వచ్చి మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇలా వచ్చిన ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో  జల్‌పల్లి మున్సిపాలిటీ అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. విఫలమవ్వడం కాదు.. కావాలనే తమ పట్ల వివక్ష చూపారని పార్దీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీసం నీటిను కూడా సమకూర్చకపోవడంతో సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశామని వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలకు స్నానాలు చేసేందుకు నీరు లేకపోవడంతో మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలోని మూత్రశాలలో కొంత మంది స్నానాలు చేశారు. ఇది కూడా నచ్చని మున్సిపాలిటీ అధికారులు ఏకంగా వారు రాకుండా కార్యాలయ గేట్‌కు తాళం వేశారు. ఒకవైపు మున్సిపాలిటీ పరిధిలోని తమకు నచ్చిన వారి ఇళ్లల్లోకి ఏకంగా నీటి ట్యాంకర్లను పంపిస్తున్న అధికారులు ఏడాదికోసారి ఉత్సవం కోసం వచ్చిన వారికి నీరు ఇవ్వకపోవడం ఏమిటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని కారణంగా యువతులు, మహిళలు జల్‌పల్లి, ఉందాసాగర్‌ చెరువుల వద్ద స్నానాలు చేయాల్సిన పరిస్థితి.

కావాలనే మాపై వివక్ష  చూపిస్తున్నారు..  
పహాడీషరీఫ్‌లో వచ్చే నెలలో నిర్వహించనున్న ఇజ్తెమా (ఇస్లామిక్‌ సమ్మేళనం)కు దేశం నలుమూలల నుంచి ముస్లింలు రావడాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తోందనీ కానీ చిన్న పాటి ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చే తమకు మాత్రం నీరు, విద్యుత్‌ సదుపాయాలు కూడా ఎందుకు కల్పించడం లేదని నక్కల పిట్టల్లోల సంఘం నాయకులు విజయ్‌ కుమార్, చిట్టిబాబు, రవి, రమేశ్‌ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆడ పడుచులు స్నానం చేసేందుకు వస్తే మున్సిపాలిటీ గేట్‌కు తాళం వేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు