సొంత కార్లు.. బినామీ బిల్లులు

2 Mar, 2018 03:56 IST|Sakshi

     అద్దె వాహనాల పేరిట అధికారుల దందా

     బినామీల పేర్లతో బిల్లులు డ్రా

     ఆటోలు, బైక్‌ల నంబర్లతో తప్పుడు బిల్లులు

     ట్రెజరీ సిబ్బందికి ముడుపులతో కళ్లకు గంతలు

     అధికారిక విచారణలోనే అడ్డగోలుగా తేలిన అక్రమాలు

     దిద్దుబాటుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: అద్దె వాహనాలు.. రాష్ట్ర ఖజానాకు భారీగా కన్నం వేస్తున్నాయి. అవసరానికి మించి వాహనాలు తీసుకోవడం.. సొంత వాహనాలను కూడా అద్దెవాహనాలుగా పెట్టడం.. ఆటో, మోటార్‌ సైకిళ్ల నంబర్లతో తప్పుడు బిల్లులు పెట్టి సొమ్ము స్వాహా చేయడం యథేచ్ఛగా సాగిపోతోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఈ తతంగం కొనసాగుతున్నట్లు ప్రభుత్వ విచారణలోనే వెల్లడైంది. దీంతో అక్రమాల నియంత్రణకు సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని వివిధ కార్యాలయాల్లో 500 వాహనాలు, వాటి బిల్లులను తనిఖీ చేయించింది. అందులో 173 మంది అధికారులు అద్దె వాహనాల పేరుతో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది.

‘అద్దె’వెసులుబాటుతో దందా
రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం అమల్లో ఉంది. అవసరమైతే అన్ని విభాగాలు, అన్ని శాఖలు, కార్యాలయాల అధికారులు అద్దె వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణిస్తే జిల్లాల్లో నెలకు రూ.33 వేలు, హైదరాబాద్‌లో రూ.34 వేలు చెల్లించేలా నిబంధనలను విధించింది. 2,500 కిలోమీటర్లకు మించి తిరిగితే ఆర్థిక శాఖ అనుమతితో అదనపు బిల్లులు చెల్లించేలా షరతులు విధించింది. ఈ వెసులుబాటును అధికారులు దందాగా మార్చుకున్నారు. ఇలా వేలాది వాహనాలు చేరి, ఖర్చు కోట్లలోకి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తల పట్టుకుంటోంది. ఇక ఎలాగూ ప్రభుత్వానికే నడుపుతున్నామనే ఉద్దేశంతో అద్దె వాహనాల యజమానులు ట్యాక్సీ పర్మిట్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం ఆర్టీఏకు కట్టాల్సిన పన్నులు చెల్లించడం లేదు. దాంతో ఖజానాకు గండి పడుతోంది.

ఆన్‌లైన్‌లోనమోదుతో అడ్డుకట్ట
అద్దె వాహనాల బాగోతంపై ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. దీనికి కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యాలయాల వారీగా ప్రస్తుతమున్న వాహనాలు, వాటి రిజిస్ట్రేషన్‌ నంబర్లు, వాటికి చెల్లిస్తున్న అద్దె వివరాలను సేకరిస్తోంది. వాటిని ఆన్‌లైన్‌లో నమోదుచేసి.. అలా నమోదైన వాహనాలకు సంబంధించి మాత్రమే బిల్లులు చెల్లించేలా ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేయనుంది.  

ఎన్నెన్నో అక్రమాలు
- హైదరాబాద్‌లోని అత్యధిక కార్యాలయాల్లో టెండర్లు పిలవకుండానే వాహనాలను అద్దెకు తీసుకున్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది అధికారులు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపి, బినామీ పేర్లతో బిల్లులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
- రెగ్యులర్‌ పోస్టుతో పాటు అదనంగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు అధికారులు.. రెండు పోస్టుల పేరుతో రెండు అద్దె వాహనాలు చూపుతూ, రెండు చోట్లా బిల్లులు డ్రా చేసుకుంటున్నారు.
- విద్యుత్‌ శాఖ, హైదరాబాద్‌ వాటర్‌ సప్లై విభాగాల్లో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ ఇంజనీర్లు, డీజీఎం స్థాయి అధికారులు నిర్ణీత రూ.33 వేల కంటే అధికంగా బిల్లులు క్లెయిమ్‌ చేసుకున్నారు.
- ఇక కొందరు అధికారులైతే కార్లు వినియోగించినట్లుగా చూపుతూ ఏకంగా బైకులు, ఆటోల నంబర్లు వేసి తప్పుడు బిల్లులు పెట్టారు. మరికొందరు ప్రైవేటు ట్రావెల్స్, అద్దె కార్ల ఓనర్లకు డబ్బులిచ్చి వారి కార్ల పేరిట తప్పుడు బిల్లులు తీసుకుని.. సొమ్ముచేసుకుంటున్నారు.
- ఇలా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు.. జిల్లా ట్రెజరీ, సబ్‌ ట్రెజరీ ఆఫీసుల్లో సిబ్బందిని మామూళ్లతో మభ్యపెట్టి.. బిల్లులు పాస్‌ చేయించుకుంటున్నట్లు తేలింది.
- పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో హౌజింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ ఇంజనీరింగ్‌ అధికారి బినామీ పేరుతో సొంత వాహనాన్ని అద్దెకు పెట్టడంతో పాటు.. దానికి అవసరమయ్యే డీజిల్‌ను సైతం కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు