ఆస్పత్రి సమస్యలపై పట్టింపేది!

16 Jun, 2017 12:34 IST|Sakshi
ఆస్పత్రి సమస్యలపై పట్టింపేది!

► రోగులకు తీరని అవస్థలు
► గైనిక్‌లో గర్భిణుల గోస
► వైద్యులు, వైద్యసిబ్బంది కొరతతో సతమతం
► నేడు ఉన్నతాధికారుల సమావేశం


నిజామాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సమస్యల పరిష్కారంపై అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం కొనసాగుతోంది. ఆస్పత్రిలో రోగులు అనేక అవస్థలు పడుతున్నా పరిష్కారమార్గాలు కనబడడం లేదు. ముఖ్యమైన సమస్యలను సైతం పట్టించుకోవడం లేదు. నేడు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, మెడికల్‌ కళాశాలలో అభివృద్ధి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదర్‌ రాజు, డీఎంఈ రమణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

గర్భిణుల గోస....
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం గర్భిణి, బాలింతల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ఆస్పత్రికి ప్రతి రోజు 50 నుండి 60 మంది వరకు గర్భిణులు ప్రసవానికి వస్తున్నారు. ఆస్పత్రిలో కేవలం మూడు వార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రసవం అయిన బాలింతకు, ఆపరేషన్‌ అయితే 4 నుండి 5 రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచుతున్నారు. ప్రస్తుతం గర్భిణుల తాకిడి ఎక్కువగా ఉండడంతో వార్డులు సరిపోవడం లేదు. నెలపైనే గర్భిణులు పడుకుంటున్నారు.

అంతేకాకుండా 16 మంది స్త్రీ వైద్యనిపుణులు అవసరం ఉండగా కేవలం నలుగురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. డెలివరీ కోసం వచ్చే మహిళలు గంటల తరబడి వేచి చూస్తున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. వైద్యసిబ్బంది అతి తక్కువగా ఉండడంతో నరకయాతన పడుతున్నారు. బాలింతలు వార్డుల్లో సరైన సదుపాయాలు లేక నేలపైనే పడుకోవడం, ఫ్యాన్లు అందుబాటులో లేకపోవడం, ఎలుకలు, దోమల బాధతో అవస్థలు పడుతున్నారు.  ప్రస్తుతం కేసీఆర్‌ కిట్‌ అందించడంతో మరింత గర్భిణుల తాకిడి పెరిగింది.  దీనికి అనుగుణంగా సౌకర్యలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఖాళీలతో...
ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సిబ్బందికొరత ఇబ్బందిగా ఉంది. సుమారు 150 స్టాఫ్‌నర్సులు, 230 వరకు 4వ తరగతి ఉద్యోగులు, ల్యాబ్‌టెక్నీషియన్‌లు , ఫార్మసిస్టులు అవసరం ఉండగా  కేవలం స్టాఫ్‌నర్సులు 50 మంది వరకు ఉండగా, మిగిత 50 మంది లోపు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వెయ్యికి పైబడి అవుట్‌పేషెంట్‌ రోగులు, 650 నుండి 700 మంది వరకు ఇన్‌పేషెంట్‌ రోగులు ప్రతి రోజు నమోదు అవుతున్నారు. జనరల్‌ ఆస్పత్రికి రోగుల సంఖ్యకు అనుగుణంగా 294 మంది వైద్యుల అవసరం ఉంది. కాని ప్రస్తుతం 74 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

ప్రస్తుతం రేడియోలాజీ విభాగంలో అసలు వైద్యులే అందుబాటులో లేరు. అత్యవసర విభాగంలో 12 మంది వైద్యులు ఉండవల్సి ఉండగా ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిత వారు కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతుండగా ఆస్పత్రిలో పనిచేసేందుకు ఇష్టం లేక వెళ్లిపోయారు. ఆస్పత్రిలో 12 మంది మత్తు మందు వైద్యులు ఉండవల్సి ఉండగా కేవలం ఒకరు మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల నలుగురు వైద్యులను పదోన్నతి పేరిట హైదరాబాద్‌కు పంపారు. అక్కడ పదోన్నతి పొందిన వారు ఇక్కడికి రావల్సి ఉండగా రాలేకపోయారు.

దీంతో కొరత ఏర్పడుతుంది. ప్రస్తుతం సీనియర్‌ రెసిడెన్షియల్‌ డాక్టర్లు అందుబాటులో లేరు. కేవలం 12 మంది మాత్రమే ఉండగా వీరు కోర్టు నిబంధనల పేరుతో ఆస్పత్రికి రావడం లేదు. ముఖ్యమైన గైనిక్‌ విభాగంలో వైద్యులులేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతి రోజు 50 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. దీనికి తోడు నిబంధనల ప్రకారం 16 మంది స్త్రీ వైద్యనిపుణులు ఉండవల్సింది పోయి కేవలం ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. మరో ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మరొకరు ఫారేన్‌ డిప్యూటేషన్‌పై మరొకరు కొనసాగుతున్నారు.అయిన కూడా తీవ్రమైన కొరత నెలకొంది.

గైనిక్‌లో మూడు విభాగాలు ఉండగా వైద్యులు సరిపోవడం లేదు. మరో ఇద్దరు వైద్యులు ఏడాదిన్నరగా గైర్హాజరులో ఉన్నారు. ప్రొఫెసర్లు కొందరు సెలవుల్లో ఉండగా, మరికొందరు హైదరాబాద్‌ నుండి రాకపోకలు సాగించడంతో వారానికి ఒకటి, రెండు రోజులు అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుతం రేడియాలజీ విభాగంలో వైద్యులు లేక అద్దె ప్రతిపాదికన ఒక వైద్యున్ని ఆస్పత్రికి తీసుకువస్తున్నా సమస్య తీరడం లేదు. ఆర్థో విభాగంలో ఇద్దరు, జనరల్‌ సర్జన్‌ విభాగంలో మరో ఇద్దరు కొరతగా ఉన్నారు. ఆస్పత్రిలో కొందరు కాంట్రాక్టు వైద్యులు పనిచేస్తుండగా వీరికి ఆరు నెలలుగా వేతనాలు లేవు. దీంతో కొందరు వైద్యులు ఆస్పత్రికి రావడమే మానివేశారు.

వేతనాలు మహాప్రభో....
ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగి సంరక్షణ కింద అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులను నియమించారు. ఇందులో 41 మంది ఉద్యోగులు గత జనవరి నెలలో అవుట్‌సోర్సింగ్‌ ద్వారా నియమింపబడ్డారు.స్టాఫ్‌నర్సులు 20 మంది, ల్యాబ్‌ టెక్నీషియన్, ఎక్స్‌రే విభాగం ఉద్యోగులు మరో 20 మంది మొదట నియామకం అయ్యారు. అనంతరం మరొకరు అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా నియమించారు. వీరికి గత జనవరి నెల నుండి ఇప్పటి వరకు వేతనాలు అందించడం లేదు. స్టాఫ్‌నర్సులు వేతనాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో విధులకు రావడానికే ఇక్కట్లు పడుతున్నారు. డాక్టర్లు, తోటి సిబ్బంది వద్ద అప్పులు చేస్తూ విధులకు వస్తున్నారు. కొందరు సిబ్బంది అసలే విధులకు రావడం లేదు. చిన్నపిల్లల అత్యవసర విభాగంలో 18 మంది సిబ్బందికి ఏడాది కాలంగా వేతనాలు రావడం లేదు. అలాగే ఈ–ఆస్పత్రి విభాగంలో కంప్యూటర్‌ సెక్షన్‌ సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు లేవు. వీరు తరచుగా విధులకు గైర్హాజరవుతున్నారు.

మరిన్ని వార్తలు