బెల్లం మూటలతోనే తెగిన ఓహెచ్‌ఈ తీగ

24 Nov, 2019 10:26 IST|Sakshi
కాలనీతండాలో తండావాసులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఆర్‌పీఎఫ్, ఎక్సైజ్‌శాఖ అదికారులు

‘కొల్హాపూర్‌’ ఘటనపై సాగుతున్న విచారణ

కేసముద్రం: ప్రయాణిస్తున్న రైలులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బెల్లం మూటలు విసరడంతోనే కేసముద్రం–ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ల మధ్య గురువారం రాత్రి ఓహెచ్‌ఈ తీగ తెగిపోయి, పలు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడినట్లు రైల్వేశాఖ పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు జరిగిన ఘటనపై రైల్వే పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. కేసముద్రం–ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ల మధ్య ఓహెచ్‌ఈ తీగ తెగిన ఘటనతో కొల్హాపుర్‌తోపాటు పలు రైళ్లు ఎక్కడికక్కడ గంటల తరబడి నిలిచిపోవడం, మరికొన్ని రైళ్లను దారి మళ్లించడం, కొన్ని రైళ్లను రద్దుచేసిన విషయం విదితమే. మొత్తంగా ఈ ఘటనతో రైల్వేశాఖకు తీవ్ర నష్టం వాటిళ్లడంతోపాటు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

దీంతో సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు.. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు విచారణ చేపట్టారు. కొల్హాపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ కంటే ముందుగా వెల్లిన ఓ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో నుంచి బెల్లం మూటలు విసరడం వల్ల స్తంభానికి బలంగా తాకి ఊగడంతో ఓహెచ్‌ఈ తీగ తెగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఘటనా స్థలం చుట్టుపక్కల శనివారం రైల్వేపోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ట్రాక్‌పక్కన బెల్లం ముద్దలు, చిరిగిన బస్తా లభ్యమైంది. దీంతో ఓహెచ్‌ఈ తీగ తెగడానికి బెల్లం మూటలు విసరడమే కారణమని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది.

తండాల్లో కౌన్సెలింగ్‌
కేసముద్రం–ఇంటికన్నె మధ్య ఓహెచ్‌ఈ తీగ తెగిన ఘటనపై శనివారం మండలంలోని గిర్నితండా, ఎన్టీఆర్‌ నగర్, కాలనీతండాల్లో ఎక్సైజ్‌శాఖ, ఆర్‌పీఎఫ్‌ , ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులు తండావాసులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు 30 కేజీల బెల్లం, 2 లీటర్ల గుడుంబా, 100 లీటర్ల  బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రైళ్లల్లో నుంచి బెల్లంమూటలు విసరడం వల్ల స్తంభాలకు తాకి ఓహెచ్‌ఈ తీగలు తెగిపోయి, ప్రమాదాలు వాటిల్లే పరిస్థితి ఉందని రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇకనైనా రైళ్లలో నుంచి బెల్లం రవాణ చేయడం, గుడుంబా తయారీ మానుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై నరేందర్, ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై జయశ్రీ, ఎన్‌పోర్స్‌మెంట్‌ ఎస్సై భిక్షపతి, డీటీఎఫ్‌ కుమారస్వామి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు